తలదించని వ్యక్తిత్వం... తలవంచని మనస్తత్వం... కోడెలది సున్నిత మనస్తత్వం

 

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల... గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్.. వారణాసిలో ఎంస్ పూర్తి చేశారు. అసలు ఆరోజుల్లో వైద్య విద్యను అభ్యసించడమే గొప్ప అయితే, ఎంఎస్ పూర్తి చేయడం మరో సంచలనం. అంతేకాదు నర్సరావుపేటలో సొంతంగా ఆస్పత్రిని నెలకొల్పి రూపాయికే వైద్యం అందించడంతో పల్నాడులో కోడెల పేరు మోరుమోగిపోయింది. రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న కోడెలను ప్రజలు ఎంతో అభిమానించేవారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కోడెలను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారు. ఎన్టీఆర్ స్వయంగా కోరడంతోనే అతి చిన్న వయసులో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కోడెల. అయితే, రాజకీయాల్లో వచ్చినా, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినప్పటికీ, కొద్దిరోజులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. అందుకే కోడెల అంటే పల్నాడు ప్రజలకు అంత అభిమానం. కోడెలపై పల్నాడు ప్రజలకున్న అభిమానమే ఆయన్ను వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. 1983లో మొదటిసారి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్... అప్పట్నుంచి 1999వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో తిరుగులేని, ఎదురులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88 మధ్య హోంమంత్రిగా, అలాగే, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, 2004, 2019 ఎన్నికల్లో కోడెల ఓటమి చెందారు. 2014లో మళ్లీ సత్తెనపల్లి నుంచి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా సేవలందించారు.

అయితే, కోడెలది తలదించని వ్యక్తిత్వం.... తలవంచని మనస్తత్వం... అంతేకాదు అత్యంత సున్నిత మనస్కుడు... స్నేహశీలి... పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి... అదే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలిగొంది. చిన్న ఆరోపణను కూడా తట్టుకోలేని మనస్తత్వం కోడెలది... అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే  ఒక్క కోడెలపైనే 19 కేసులు పెట్టింది. ఇక ఆయన కుమారుడు, కూతురుపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. పైగా కోడెలపై దొంగతనం కేసు మోపడం... ఆ కేసుల్లో జీవితఖైదు పడే సెక్షన్లను పెట్టడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంద రోజుల్లో వంద రకాలుగా వేధించడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాజకీయాల్లో రాటుతేలిన నేత అయినప్పటికీ, చివరి రోజుల్లో అలాంటి అపనిందలను తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా తనపై మోపిన అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగం నుంచి బయటపడేందుకు కోడెల తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు... ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి లేఖ రాశారు... తనను మానసికంగా క్షోభపెట్టొద్దంటూ వేడుకున్నారు... అసెంబ్లీ ఫర్నిచల్ తరలింపులో తన తప్పులేదని, హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ను తీసుకొచ్చే క్రమంలో అధికారులే తన క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారని, తన పదవీ కాలం పూర్తయిన తర్వాత  వెంటనే ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరానని, లేదా వెల కడితే డబ్బు చెల్లిస్తానని జూన్ ఏడునే లేఖ రాశానని, కానీ అధికారులు స్పందించలేదని, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి లేఖలు రాశానని, అయినా స్పందించకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోడెల ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఇప్పటికే తన కార్యాలయం నుంచి ఫర్నిచర్ ను తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చని, కానీ తనను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రభుత్వానికి కోడెల విజ్ఞప్తి చేశారు. 37ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలుచేస్తూ, దొంగతనం కేసు మోపి, తనను మానసిక క్షోభకు గురిచేయవద్దని కోరారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించలేదు... కోడెలపై వేధింపులకు పాల్పడింది. 90రోజుల్లో 19 కేసులు పెట్టి క్షోభకు గురిచేసింది. కోడెలకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుట్ర చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా చేసిన రచ్చను కోడెల తట్టుకోలేకపోయారు. చివరి ఆ మనోవేదనతోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.