కేసీఆర్ పైకి కేశవాస్త్రం ప్రయోగించనున్నసోనియమ్మ

 

ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు. అంతకు మించి మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు.

 

పార్టీలో అందరికంటే ఎక్కువ గట్టిగా తెలంగాణా అంశంపై మాట్లాడుతున్నవ్యక్తి ఆయనే గనుక, బహుశః తెలంగాణా అంశంపై పార్టీ వైఖరిని ఆయనకి స్పష్టంగా తెలియజేసి, తదనుగుణంగా ఆయనకు హామీ ఇచ్చిఉండవచ్చును. అందుకు ప్రతిగా రానున్నఎన్నికలలో పార్టీని గెలిపించేందుకు పార్టీలోని తెలంగాణా వాదులనందరినీ ఒక త్రాటిపైకి తెచ్చే బాధ్యత ఆయనకి అప్పగించి ఉండవచ్చును. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణా వచ్చేఅవకాశం ఉంది. కనుక, తెలంగాణా నేతలు పార్టీలు మారి ఎటువంటి ప్రయోగాలు చేసినా దానివలన, తెలంగాణా మరింత ఆలస్యం అవడమే కాకుండా, అటు వారికి, ఇటు పార్టీకి ఇద్దరికీ కూడా నష్టం కలగడమే కాకుండా, అంతిమంగా అందరూ కలిసి కేసీఆర్ లబ్ది చేకూర్చిన వారవుతారని ఆమె కేశవ్ రావుకి ఉపదేశం చేసి ఉండవచ్చును.

 

ఇక, ఆమె స్వయంగా కేశవరావును పిలిచి మాట్లాడినందున, ఇంతకాలం తమ గోడు చెప్పుకొనేందుకు కూడా అవకాశం ఈయలేదని అధిష్టానంపై అలిగిన తెలంగాణా కాంగ్రెస్ నేతల అహం కూడా చల్లారుతుంది. తద్వారా ఇక వారు కేసీఆర్ ఉచ్చులో పడకుండా కాపాడుకోవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కావచ్చును. ఈ సమావేశంతో, కేసీఆర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలపై పెట్టుకొన్న ఆశలు అడియాశలయినట్లే భావించవచ్చును.

 

తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య సంప్రదింపులు చేసిన కేసీఆర్ డిల్లీలో ఏమిజరిగిందో చాలా సులువుగానే అంచనా వేయగలరు. ఊహించని విధంగా సోనియాగాంధీ పావులు కదిపి, తనతో కలుస్తాడని ఆశపడిన కేశవ్ రావునే తనపై బాణంగా ఎక్కుపెట్టబోతోందని కేసీఆర్ ఈ పాటికి గ్రహించే ఉంటారు. అందువల్ల, కేశవ్ రావు తొలి స్పందన ఏవిధంగా ఉంటుందో చూసిన తరువాత, కేసీఆర్ కేశవ్ రావుని కూడా మళ్ళీ బూతులు లంఖించుకొనే అవకాశం ఉంది.