కిషన్‌రెడ్డి కితకితలు!

 

 

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే కితకితలు పెట్టినట్టు నవ్వొస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో పక్షపాత ధోరణితో తెలంగాణకే పూర్తి మద్దతు ప్రకటించి సీమాంధ్రలో పార్టీని గల్లంతు చేసినందుకు బీజేపీ అగ్రనాయకత్వం కిషన్‌రెడ్డికి అక్షింతలు వేసింది. అప్పటి నుంచి ఆచితూచి మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి అప్పుడప్పుడు అదుపుతప్పి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు.

 

 

బీజేపీ సీమాంధ్ర నాయకులెవరైనా ‘సమైక్యం’ అనే మాట మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కిషన్‌రెడ్డి సారు తాజాగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని విభజించాలని ఉద్యమాలైతే చేయొచ్చుగానీ, ఆల్రెడీ వున్న ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేయొద్దనడం మాత్రం నేరమట!  ఇప్పటికే కిషన్‌రెడ్డి వ్యవహారశైలి మీద గుర్రుగా వున్న సీమాంధ్ర నాయకులకు ఈ వ్యాఖ్యలు పుండుమీద కారంలా మారాయి. బీజేపీ కేంద్ర నాయకత్వమే తెలంగాణ మీద పునరాలోచించుకుంటున్న సమయంలో కిషన్‌రెడ్డి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం న్యాయం కాదని వారంటున్నారు.

 



సమైక్యం అంటే సీమాంధ్ర నాయకులను సస్పెండ్ చేస్తానని ప్రకటించిన కిషన్‌రెడ్డి ఇంకా ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం వందలాదిమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ ‌గాంధీ కోసం తెలంగాణ విభజనను చేపట్టిందని చెప్పారు. అంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుందని తెలిసీ బీజేపీ అందుకు మద్దతు ఇస్తోందని అర్థమా? కిషన్‌రెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు. బీజేపీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదించలేదని అన్నారు.

 



కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత ఆయన తెలంగాణకు అనుకూలంగా వున్నారా.. వ్యతిరేకంగా వున్నారా అనే విషయం సామాన్యులకు  అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. కిషన్‌రెడ్డి ఈతరహా కితకితలు ఆపి క్లారిటీతో మాట్లాడితే బెటరంటున్నారు. తన సొంత ఎజెండాలో క్లారిటీ లేకపోతే బుద్ధిగా కేంద్ర నాయకత్వం చెప్పినట్టు వింటే మంచిదని సూచిస్తున్నారు.