జీహెచ్ఎంసీకి కేంద్ర నిధులు ఇవ్వలేమన్న కిషన్! పార్టీకి భారమంటూ కేడర్ ఫైర్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం దూకుడుగా పోరాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నగరం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్య వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తీరుతో కమలం పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం హోరాహారీగా జరుగుతున్న సమయంలో కేడర్ లో జోష్ నింపాల్సిన కిషన్ రెడ్డి.. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతున్నారన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. ముఖ్యంగా వరద సాయం, కేంద్ర నిధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా, నగర ఎంపీగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టాంచాల్సిన కిషన్ రెడ్డే.. పార్టీ భారంగా మారారనే చర్చ బీజేపీ నుంచే వినిపిస్తోంది. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం చేసిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం కొందరికి మాత్రమే అందింది. దీంతో సాయం అందని వారంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు సాయంగా 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఇది జనంలోకి బాగా వెళ్లింది. ఇది గ్రహించిన  అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద సాయం చేసేది జీహెచ్ఎంసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని.. టీఆర్ఎస్సే ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి... సాయం చేయడం తమతోనే సాధ్యమని ఎన్నికల ర్యాలీలలో చెబుతూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి వరద బాధితులకు సాయం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటిస్తే బీజేపీకి ఎంతో బూస్ట్ వచ్చేది. అయితే అలాంటి ప్రకటన చేయని కిషన్ రెడ్డి.. సంజయ్ హామీనే తప్పనే అర్దం వచ్చేలా మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వదని, అలా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని చెప్పారు కిషన్ రెడ్డి. 

 

కిషన్ రెడ్డి ప్రకటనతో కమలం నేతలు అవాక్కయ్యారట. సంజయ్ ఇచ్చిన వరద సాయం హామీ వల్ల వచ్చిన మైలేజీ అంతా కిషన్ రెడ్డి ప్రకటనతో పోయిందని గ్రేటర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. వరద సాయం, కేంద్ర నిధులపై  కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంది టీఆర్ఎస్. కిషన్ రెడ్డి కామెంట్లను నిమిషాల్లో వైరల్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వదని కేంద్రమంత్రి చెబుతుంటే.. ఇంటికి 25 వేల రూపాయలు సాయం చేస్తామంటూ ప్రజలను బండి సంజయ్ మోసం చేస్తున్నారంటూ.. ఇద్దరు మాట్లాడిన వీడియోలను జనంలోకి వదిలారు కారు పార్టీ నేతలు. ఆ వీడియోలు చూసిన జనాలకు కూడా.. బీజేపీ ఎక్కడి నుంచి తెచ్చి వరద సాయం చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం సొల్లు ప్రసంగాలు చేస్తున్నారని.. ఇలా అయితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం కమలం కేడర్ లో వస్తోంది అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ కిషన్ రెడ్డి నామమాత్రంగా వ్యవహరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.  

 

అంతేకాదు కిషన్ రెడ్డి ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది.  ఎంఐఎం సహకారం వల్లే అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా  ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారని కూడా చెబుతారు. ఇప్పుడు ఇది కూడా గ్రేటర్ ప్రచారంలో బీజేపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. గతంలో అసద్ తో కిషన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు, వారిద్దరు వేదికలపై నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్న వీడియోలను కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కమలం నేతలకు ఇది మైనస్ గా మారిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. గ్రేటర్ టికెట్ల 
విషయంలోనూ కిషన్ రెడ్డి వ్యవహారం వల్లే కొన్ని చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.