5వందలేళ్ల కింద, మోదీ గురించి చెప్పిన వారెవరో తెలుసా?

 

దేశంలో మోదీ పవనం వీస్తోంది! ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాల్ని నమో సునామీ ముంచేస్తోంది! అయితే ఇదంతా మనం పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నాం. కాని, మోదీ అభిమానులు, అంటే... మోదీ భక్తులు మరింత ఆశ్చర్యకర కోణాల్లో చూస్తున్నారు! ఏకంగా అయిదారు వందల ఏళ్లు వెనక్కి వెళ్లిపోయి అక్కడ నరేంద్రుడి గొప్పతనం తాలూకూ సాక్ష్యాలు వెదుకుతున్నారు! పనిలో పనిగా పార్లమెంట్లోనే తమ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు!

 

కృతి సోమయ్యా అనే ఎంపీ బీజేపి నుంచి గెలిచారు. ఈ విషయం గతంలో మీకు తెలుసో లేదో కాని ఇవాళ్ల ఆయన లోక్ సభలో చేసిన ప్రసంగంతో అందరికీ తెలిసిపోయింది! కమల దళం నాయకుడు తన మోదీ భక్తిని ఏకంగా పదహారవ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ ను చర్చలోకి తెచ్చి మరీ చాటుకున్నాడు. ప్రతిపక్షాల్ని ఉద్దేశించి ఘాటైన ప్రసంగం చేసిన సోమయ్యా మోదీ వస్తాడని పదహారవ శతాబ్దంలోనే నోస్ట్రాడామస్ చెప్పాడని అన్నాడు. అంతే కాదు, ఒక నాయకుడు తూర్పున పుట్టుకొచ్చి ఇండియాని సమున్నత స్థితిలో నిలబెడతాడని ... అతను మోదీనేనని నోస్ట్రాడామస్ ను ఉటంకిస్తూ బీజేపి ఎంపీ చెప్పుకొచ్చాడు!

 

 

మోదీ గురించి నోస్ట్రాడామస్ నిజంగా చెప్పాడా? దీనిపై పెద్దగా క్లారిటీ లేదు. 2014లో మోదీ ఘన విజయం సాధించినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఈ ప్రచారం భారీగా జరిగింది. అమెరికా ఆవిర్భావం గురించి, హిట్లర్ గురించి, వాల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవటం గురించి... ఇలా చాలా విషయాలు చెప్పిన నోస్ట్రాడామస్ మోదీ రాక గురించి కూడా చెప్పాడని అప్పట్లో అన్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు కూడా అ మధ్య ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దాంతో పెద్ద కలకలమే రేగింది! మళ్లీ ఇప్పుడు కృతీ సోమయ్యా మరోసారి మోదీ అవతార పురుషుడని ప్రకటించేశాడు! అదీ పార్లమెంట్లో!

 

మోదీ ఖచ్చితంగా జనాలు ఆదరిస్తున్న నాయకుడే. ఆయన్ని స్వంత పార్టీ నేతలు పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, ఆ పని మరో విధంగా చేస్తే బావుంటుంది. నోస్ట్రాడామస్ ఉవాచల్ని ఆధారం చేసుకోని ప్రధానిని ప్రశంసించటం అనవసరంగా ప్రతిపక్షాలకి ఒక విమర్శ చేసే అంశాన్ని నోటికి అందించినట్టే అవుతుంది!