కిరణ్ వేరు కుంపటి పెట్టుకొంటారా లేదా

 

రాష్ట్ర విభజన సీరియల్ మొదలయిన నాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అందులో హీరో, విలన్ పాత్రలు రెండు చేసేస్తూ, ఎవరు కోరుకొన్నట్లు వారికి దర్శనమిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. అదే విధంగా అక్టోబర్ మొదటివారంలో అధిష్టానం ఆయన ప్లగ్గు పీకేయబోతోందని కేసీఆర్ సైతం ఓ డేట్ కూడా ఇచ్చేసారు.

 

ఈ ప్లగ్గు పీకుడు సస్పెన్స్ ఇలా కొనసాగుతుంటే, మరో వైపు కొత్తగా కొత్తపార్టీ లీకొకటి పుట్టుకొచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదూ కదా?అని మీడియా వాళ్ళు ఆయనని అడిగితే “నేను ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే, మీరేమిటి కొత్త పార్టీ పెడతారా? అని అడుగుతున్నారు” అని ఎదురు ప్రశ్నిస్తూ తెలివిగా సమాధానం దాట వేస్తారు.

 

ఇక కేంద్రం కూడా తన వంతుగా రోజుకొక రకంగా మాట్లాడుతూ ఈ సీరియల్లో సస్పెన్స్ కొనసాగిస్తుంటుంది. ఆయన ప్లగ్గు ఊడుతుందా లేదా? కొత్త పార్టీ పెడతారా లేదా? శాసనసభకు తెలంగాణా తీర్మానం వస్తుందా లేక ఏదో కాగితం ముక్క మాత్రమే వస్తుందా? వచ్చేకయినా ఈ పెద్దమనుషులు రాజీనామాలు చేస్తారా లేదా? చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? వంటి అనేక యక్ష ప్రశ్నల గురించి ఒకేసారి శ్రమ పడి ఆలోచించడం కంటే, ఏదో ఒకటే పాయింటు పట్టుకొని ఆలోచించుకొంటే అందరికీ తేలికగా ఉంటుంది.

 

కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని గొప్ప సత్యం ప్రకటించారు, గనుక ఆయన పార్టీ పెట్టేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని అనుకోవచ్చును. అయితే ఆయనను గొప్పసమైక్య హీరో అని జనాలు ఎంతగా మెచ్చుకొంటునప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోఆయనకు ‘లైక్స్’ తక్కువేనని చెప్పక తప్పదు. ఎవరి కారణాలు వారికున్నాయి.

 

ఒకరికి ఆయనలో అహంభావం నచ్చదు, మరొకరికి ఆయన సీనియారిటీ సరిపోదు. మరికొందరికి ఆయన చూపించిన చేదు అనుభవాలు ఇంకా తాజాగానే ఉన్నందున ఇబ్బంది. చాలా మందికి ముఖ్యమంత్రి పదవి అత్యవసరం గనుక దానిని ఆయనతో పంచుకోలేక చేరలేకపోవచ్చును. పార్టీ పెట్టక మునుపే ఇంతమందికి ఆయనతో సమస్యలున్నప్పుడు వారు ఆయన నేతృత్వంలో పనిచేస్తారని అనుకోలేము.

 

అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టాలంటే తనకు వంది మాగాదులుగా ఉండే వారిని పోగేసుకోవలసి ఉంటుంది. వారు తప్పనిసరిగా గెలుపు గుర్రాలయ్యి ఉండాలి. ఎవరి ఎన్నికల ఖర్చు వారే భరించుకోవాలి. సోనియమ్మ, రాహుల్ గాంధీల పేర్లు చెప్పుకోవడానికి వీలుండదు గనుక, అభ్యర్ధులు తమ తమ గోత్ర నామాలు చెప్పుకొనే ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యమయిన షరతు మరొకటి ఉంది. ఎన్నికలయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిందుకు అంగీకరించాలి. వీటిలో దేనిని అంగీకరించకపోయినా ఆఖరి షరతుకి మాత్రం అందరూ అంగీకరించవచ్చు గనుక, ఈ ‘ఆరు నెలల పార్టీ’ లో చాలామందే జేరవచ్చును.

 

కానీ, రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్ వంటి సీనియర్లు మాత్రం స్వతంత్రంగా పోటీచేసి ఆనక మళ్ళీ కాంగ్రెస్ హస్తం అందుకోవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకోకపోతే, ఆయనకు బొత్స, ఆనం, డొక్కా వంటి మంత్రులే పొగబెట్టడం ఖాయం. గనుక ఇష్టమున్న కష్టమున్న కిరణ్ వేరు కుంపటి పెట్టుకోక తప్పదు.