రాష్ట్ర విభజన జరిగితే కిరణ్ పరిస్థితి ఏమిటి

 

కోర్ కమిటీలో సమైక్యాంధ్ర కోసం వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపితే రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తను అటువంటి పనిచేయబోనని ఆయన స్వయంగా చెప్పారు. అంటే, అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకొంటానని అంగీకరించినట్లే భావించవచ్చును.

 

తెలంగాణా అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంటే, మరో వైపు సీమంధ్ర నేతలు సమైక్యాంధ్ర సభలు, సమావేశాలు అంటూ చాలా హడావుడి చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, శైలజానాథ్, గంట శ్రీనివాస రావు, టీజీ వెంకటేష్ తదితరులు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. కానీ వారెవరూ కూడా అధిష్టానాన్ని దిక్కరించే పరిస్థితి లేదు. వారు ఎన్ని సభలు నిర్వహించుకొన్నపటికీ అంతిమంగా అందరూ కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడేవారే. మరయితే, ఈ సమైక్యాంధ్ర సభలు, హడావుడి ఆందోళనలు ఎందుకు అని ప్రశ్నిస్తే, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమేనని చెప్పక తప్పదు.

 

రేపు అధిష్టానం రాష్ట్ర విభజన చేసినప్పుడు, వారందరూ మళ్ళీ మరోమారు బహిరంగ సభలు పెట్టి ప్రజలకి తాము ఏఏ కారణాలచేత, విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగా అందుకు అంగీకరించవలసివచ్చిందో సంజాయిషీలు ఇచ్చుకోవడం ప్రజలు చూడవచ్చును. కానీ, ఆ తరువాత, ఇంత కాలంగా తాము చేస్తున్న సమైక్యాంధ్ర కోసం చేస్తున్న పోరాటాలవల్ల ఏర్పడిన ప్రత్యేక గుర్తింపుని (యన్కాష్) సద్వినియోగించుకొంటూ వారందరూ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి, హోం, ఆర్ధిక, రెవెన్యు వంటి కీలక పదవుల కోసం పోటీలు పడవచ్చును.

 

మరటువంటి భుజకీర్తులు తగిలించుకొన్నవారితో కిరణ్ కుమార్ రెడ్డి పోటీపడి, మళ్ళీ తన ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి కేవలం కోర్ కమిటీలో తను చేసిన వాదనల గురించి మాత్రమే చెప్పుకోవడానికి ఉంటుంది. అయితే, ఆ ప్రాధమిక అర్హత రేసులో పాల్గొనడానికి సరిపోదు గనుక ఆయన ముందున్న రెండే రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటుంది.

 

మొదటి ఆప్షన్: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, అధిష్టానానికి విధేయుడిగా ఉంటూ మళ్ళీ ముఖ్యమంత్రి దక్కించుకోవడం. రెండవ ఆప్షన్: (అధిష్టానానికి తన పరిస్థితి అంతా సవినయంగా విన్నవించుకొని, సోనియమ్మఅనుమతితోనే) రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామా చేసేసి తను కూడా ఒక వీరత్రాడు వేసేసుకొని, రేసులో పాల్గొంటూ ఆనక అధిష్టానం దయతోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవడం. ఈ రెండు మార్గాలలో దేనిని ఎంచుకొంటారనేది వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తరువాత తేలిపోతుంది.

 

అయితే ఆయన వినయ విదేయతలకు, సమర్ధతకు మెచ్చిఅధిష్టానం కేంద్రానికి ప్రమోట్ చేసినా చేయవచ్చును. అదేజరిగితే, కిరణ్ పని తంతే బూర్లె గంపలో పడినట్లే మరి!