పిల్లలు హాయిగా పడుకోవాలంటే!

 

పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం అనేది కనిపించని వేదన. దాని వల్ల అటు పిల్లలూ ఇబ్బంది పడతారు, వారితో పాటుగా పెద్దలూ బాధపడతారు. పిల్లలలో నిద్రలేమి, భవిష్యత్తులో కూడా వారిలో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా Stephanie Zandieh అనే నిపుణుడు కొన్ని సలహాలను అందిస్తున్నారు. ముఖ్యంగా 1- 5 ఏళ్లలోపు పిల్లలకి ఈ సలహాలు దివ్యంగా పనిచేస్తాయంటున్నారు.

 

- పిల్లలు నిద్రపోయేందుకు ఓ సమయాన్ని అలవాటు చేయాలి. అంతేకానీ నిద్రపోతే వారే అలసిపోయి పడుకుంటారులే అనుకోవద్దు. నిజానికి అలసిపోయి పడుకునే పిల్లలు నిద్ర మధ్యలో లేచే సందర్భాలు ఎక్కువగా ఉంటాయట!!!

 

- పిల్లలు నిద్రపోయేటప్పుడు తమ పక్కన ఏదన్నా బొమ్మనో, బొంతనో ఉంచుకోవడాన్ని గమనించవచ్చు. ఇది మంచి అలవాటే అంటున్నారు నిపుణులు. ఇలా ఏదో ఒక వస్తువుతో వారి అనుబంధం వల్ల, పిల్లలు ఒక సురక్షితమైన భావనలో ఉంటారట. తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు.

 

- పిల్లవాడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా ఒకే తరహా వాతావరణాన్ని కొనసాగించండి. నిద్రపోయే ముందర స్నానం చేయించడమో, కథలు చదివి వినిపించడమో, జోలపాటలు పాడటమో చేస్తూ ఉండటం వల్ల.... పిల్లవాడు నిద్రలోకి జారుకుటాడు.

 

- పిల్లవాడి పక్కని కానీ, అతను పడుకునే ప్రదేశాన్ని కానీ, అక్కడి వెలుతురిని కానీ తరచూ మార్చడం అంత మంచిది కాదు.

 

- పిల్లవాడు తనంతట తానుగా నిద్రలోకి జారుకునేలా అలవాటు చేయడం మంచిది. దానివల్ల రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచిన తరువాత తనంతట తానుగా మళ్లీ నిద్రపోగలడు. లేకపోతే మీరు అతణ్ని గమనించుకుని మళ్లీ నిద్రపుచ్చేదాకా ఇబ్బందిపడుతూనే ఉంటాడు.

 

- పిల్లలు వేరే గదిలో పడుకుంటే, వారిని రాత్రి మధ్యలో అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండటం మంచిది. పిల్లలు ఉలిక్కిపడి లేచినట్లు అనిపిస్తే, బద్ధకించకుండా లేచి వారి దగ్గరకి వెళ్లాల్సిందే! అవసరం వచ్చినప్పుడు మీరు వారి పక్కనే ఉంటారనే భద్రతా భావం వారికి ప్రశాంతతని కలిగిస్తుంది.

 

- పిల్లలని వేరే గదిలో ఉంచడం అన్న మార్పుని ఒక్కసారిగా చేయడం మంచిది కాదు. ముందు పిల్లవాడు తనంతట తానుగా పడుకునే అలవాటు చేయాలి. ఆ తరువాత మీరు అతని కనుచూపు మేరలో ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించాలి. అవసరం అయినప్పుడు మీరు తన పక్కనే ఉంటారన్న భద్రతని అందించాలి. అప్పుడు మాత్రమే అతణ్ని వేరే చోట పడుకోపెట్టే ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే అతని నిద్ర దెబ్బతినడం సంగతి అటుంచితే తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య లేనిపోని దూరాలు ఏర్పడతాయి.

- నిర్జర.