మనస్థాపానికి గురై ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం, పరిస్థితి విషమం

 

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పెద్ద చర్చనీయంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఏం జరగబోతోంది అని అందరిలోనూ ఒక ఆందోళన మొదలైయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆయన శరీరం తొంభై శాతం వరకు కాలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నారు. టీఎంయూ నేతగా కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన కొద్ది సేపటికే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారని తోటి కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు ఏకంగా యాభై వేల ఉద్యోగులను కేసీఆర్ ఒక్కసారిగా డిస్స్మిస్ చేయడం పట్ల తీవ్రంగా మండి పడుతున్నారు.

శ్రీనివాస్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలు ఖమ్మం డిపో లోని డ్రైవర్ గా పని చేస్తున్నారు. అదే విధంగా టీఎంయూలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సమ్మె పై కేసీఆర్ ప్రసంగించిన తరువాత ప్రెస్ నోట్ ని విడుదల చేసిన వెంటనే తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా తొంభై శాతం శరీరం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతానికి అతనిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించినట్లు తెలియజేశారు. దాదాపుగా అన్ని యూనియన్ సంఘాలు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగాను, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుండటమే కాక ఇటువంటి పాలనతో ఎవరిని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరిని కూడా ప్రభుత్వం అణిచివేస్తున్న తీరుకు నిరసనగా ఆందోళన తీవ్రతరం చేస్తామని దీనిని జిల్లా పరంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉదృక్తం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వామపక్ష పార్టీలు, యూనియన్ నేతలు చేరుకున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వద్ద చేరుకోవడమే కాక అదనపు బలగాలను కూడా తీసుకొచ్చెందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.