కేరళకు మోదీ సాయం సరిపోతుందా?

 

వరద నీరు కేరళ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రంలో ప్రాణ నష్టంతో పాటు, భారీ ఆస్తి నష్టం జరిగింది.. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. కేరళ ప్రజల బాధ చూసి దేశం మొత్తం చలించిపోతుంది.. కేరళకు అండగా మేమున్నాం అంటూ ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.. సామాన్యుల నుండి సినిమావారి వరకు వారికి చేతనైనంత ఆర్ధిక సాయం వారు అందిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేరళ రాష్ట్రానికి అండగా ఉంటాం అంటూ ముందుకి వస్తున్నాయి.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయిల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.. అయితే ఇలా ఎంతమంది సాయం చేసినా, కేరళ కన్నీటిని తుడవగలరు కానీ.. గుండెల్లో ఉన్న బాధని పూర్తిగా తొలగించలేరనేది వాస్తవం.. కేరళ బాధ, భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం చేసే సాయం మీదే ఆధారపడి ఉన్నాయి.. కానీ కేంద్రం మాత్రం కేరళకు సరైన సాయం చేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం మోదీ, కేరళ రాష్ట్రానికి 500 కోట్ల రూపాయిల తాత్కాలిక సాయాన్ని ప్రకటించారు.. ఇంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం తరఫున ప్రకటించిన సాయం100 కోట్లు రూపాయిలు దీనికి అదనం.. అయితే కేంద్రం ప్రకటించిన ఈ సాయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.. కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల తాత్కాలిక సాయం ప్రకటించగానే కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్‌లో స్పందించారు.. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 19,512 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని, వరద తగ్గుముఖం పట్టగానే అసలు నష్టం ఎంతనేది అంచనా వేస్తామని చెప్పారు.. తక్షణ సాయంగా 2,000 కోట్లు కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.. మరోవైపు కేరళ ప్రజల్లో కూడా మోదీ ప్రకటించిన సాయంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.. 20 వేల కోట్లు ఆస్తి నష్టం జరిగితే, కనీసం 2 వేల కోట్ల తక్షణ సాయం అడిగితే, 500 కోట్లు ప్రకటించటం ఏంటంటూ మండిపడుతున్నారు.. గతంలో కాశ్మీర్, అస్సాం, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఈ స్థాయిలో నష్టం జరగకున్నా వేల కోట్లు ప్రకటించి, దక్షిణ రాష్ట్రంపై మాత్రం ఇలా వివక్ష చూపటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.. మరి కేంద్రం మనస్సు మార్చుకొని సాయం పెంచుతుందేమో చూడాలి.