తెలంగాణ సీఎంగా కేటీఆర్... పట్టాభిషేకానికి సర్వం సిద్ధం!!

టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై గులాబీ నేతలను ఊరిస్తూ వస్తోంది. ఈ సారి తమకు అవకాశం వస్తుందని ఆశావహులు కొండంత ఆశతో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు మరోసారి తమ రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీలో ఉద్యమ నేతలు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు ఎప్పుడెప్పుడు తమకు పదవులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఎక్కువ మొత్తంలో ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ కోసం తాము చేసిన సేవలని గుర్తు చేస్తూ తమ పొలిటికల్ ప్రొఫైల్ అందిస్తున్నారు. అయితే కేటీఆర్ ఆశీస్సులు ఉన్న వారికే పదవులు వస్తాయనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు కీలకమైన కార్పొరేషన్ పదవులు లేదా పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు వస్తాయన్న ఆశతో ఉన్నారు. లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నేతలకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ వారిలో కొద్దిమందికి విప్ పదవులు ఇచ్చి సరిపెట్టారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులతో పాటు దేవాలయ పాలక మండలి చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. వచ్చే ఏప్రిల్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి ముందే పదవులన్నింటినీ భర్తీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, వేములవాడ, యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్ లను నియమించాల్సి ఉంది. పార్టీలోని సీనియర్ నేతల తోనే ఈ పదవులు భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా లాభదాయక పదవి విషయంలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఆరుగుర్ని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన న్యాయ చిక్కుల కారణంగా కొన్నాళ్లకే వారు పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి చిక్కులకు ఆస్కారం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పదవులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. 

మరోవైపు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయనకు బలమైన అనుచరగణాన్ని ఇప్పటి నుంచే కేసీఆర్ తయారు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు నేతలంతా ఇప్పటికే కేటీఆర్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్ తమ బాస్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు అందుకున్న వాళ్ళంతా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులే. మంత్రి వర్గ కూర్పులను కేటీఆర్ సూచనలనూ కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. దీంతో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ నాటికి పదవుల భర్తీకి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి ప్లీనరీలో సంచలన ప్రకటన చేసే కేసీఆర్ ఈ సారి ప్లీనరీ లోనూ కీలక ప్రకటన చేయబోతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్లీనరీ వేదికగా కేటీఆర్ కు పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మరో రెండు మూడు సార్లు తానే సీఎంనంటూ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో త్వరలో కేటీఆర్ సీఎం అవుతారంటూ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చర్చ నీయాంశంగా మారుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా కేటీఆరే వారసుడు అని కెసిఆర్ దాదాపుగా ప్రకటించేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పే అవకాశముంటే ఢిల్లీకి కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ సీఎం అని దాదాపుగా పార్టీ ముఖ్యులకు చెప్పేశారు.అయితే అవేమీ జరగక పోవటం, కొన్ని ప్రభుత్వ పథకాలు ట్రాక్ లో పడాల్సి రావడం, స్థానిక సంస్థలుమ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో కేటీఆర్ పట్టాభిషేకాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా ప్రభావం చూపడం లేదనే భావన ఉన్నందున ఏడాది లోపే కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి లేదా అంతకంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.