కేసీఆర్ సంచలన నిర్ణయం.. మేడ్చల్ నుండి పోటీకి సిద్ధం.!!

కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. ఎన్నికలకు 8 నెలలముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇలా దూకుడు మీదున్న కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే మేడ్చల్ నుండి పోటీకి సిద్దమవ్వడం. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు కేసీఆర్ మళ్ళీ అధికారం తమదేనని ధీమాగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడిందో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మహాకూటమి నుండి బలమైన పోటీ తప్పదని కేసీఆర్ కి అర్థమైంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

 

 

టీడీపీకి తెలంగాణలో ఓటుబ్యాంకు బాగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివార్లలోని నియోజక వర్గాల్లో బలంగా ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో దోస్తీ చేయడానికి ముఖ్యకారణం. కాంగ్రెస్ తెలంగాణలో బలంగానే ఉంది కాని ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని పొందే అంత బలమైతే లేదనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ మహాకూటమి వైపు అడుగులు వేసింది. దీంతో కాంగ్రెస్, తెరాసకు ధీటైన ప్రత్యర్థిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల టీడీపీ ఓటుబ్యాంకు బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతెందుకు గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. అందుకే కేసీఆర్ ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

 

 

కాంగ్రెస్ కి టీడీపీ బలం తోడైంది. ఈ బలాన్ని తట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల అధిక స్థానాలు గెలవాలంటే తాను ఏదైనా స్థానం నుండి బరిలోకి దిగడం కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ లాంటి బలమైన నేత, సీఎం అభ్యర్థి బరిలోకి దిగితే ఆ చుట్టుపక్కల స్థానాల మీద ఆ ప్రభావం ఉంటుంది. అది తెరాసకు బోలెడంత మైలేజీ తీసుకొస్తుంది. అందుకే కేసీఆర్ ప్రస్తుతం ఆయన ప్రాతినిద్యం వ‌హిస్తున్న గజ్వేల్ నియోజ‌కవ‌ర్గంతో పాటు మేడ్చ‌ల్ నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ నిజంగానే మేడ్చల్ నుండి బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగి.. అనుకున్నట్టే మహాకూటమి జోరుకి చెక్ పెడతారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.