ఆంధ్రులారా మీరెటు వైపు... !?

తెలంగాణలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాకతో ఎన్నికల కాక మరింత వేడిక్కింది. అటు అధికార తెలంగాణ రాష్ర్ట సమితి కూడా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు, వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ గాంధీ ఇలా హైదరాబాద్ రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన రాష్ట్ర కార్యవర్గాన్ని పిలిపించాలరు. రెండు గంటలకు పైగా వారితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించారు. అలాగే అభ్యర్ధులను కూడా వచ్చే నెలలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇంతే కాదు.... ఎన్నికల సమరంలో ఒంటరి పోరే అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయనకు ఈ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని అర్ధం అయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ హడావుడి సమావేశాలు.... బహిరంగ సభలకు సన్నాహలు అని పరిశీలకులు అంటున్నారు. 

 

 

తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల కన్ను సెటిలర్లపైనే పడింది. అది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్లపైనే ఉంది. వారి మద్దతు ఎవరికి ఉంటే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలింది. హైదరాబాద్‌లో పాతబస్తీ మినహా సిటీలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రుల ఓట్లు ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగానే ఉన్నారు. వారి ఓట్లు అన్ని పార్టీలకు కీలకం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఒకింత ముందుగానే ఇక్కడి సెటిలర్లను ఆకట్టుకునే పని ప్రారంభించింది. అంతే కాదు... కొన్ని స్ధానాల్లో సెటిలర్లకు టిక్కట్లు కేటాయిస్తామని కూడా ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశం. ఆ పార్టీ వారు ప్రకటించినట్లుగా హైదరాబాద్‌లో కొన్ని స్ధానాల్లో ఆంధ్రులను ఎన్నికల బరిలో నిలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా. తెలంగాణలో దాదాపు 50 నుంచి 70 లక్షల మంది వరకూ సెటిలర్లు ఉన్నారు. వారి ఓట్లే ఇప్పుడు కీలకంగా మారాయి.

 

 

కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ ఓటు ఉండనే ఉంది. ఆ ఓట్లు కాంగ్రెస్‌వే అని వారి నమ్మకం. ఇక సెటిలర్లు తమకు ఓట్లు వేస్తే అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకలు. అందుకే వారి ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అక్కడ స్విచ్ వేసి తెలంగాణలో అధికార దీపాన్ని వెలిగించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కన్నేసింది. ఇక్కడున్న ఆంధ్రుల ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారంలోకి రావాలన్నది వారి ఆశ. ఇంతకు ముందు హైదరాబాద్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రుల మద్దతు ఊహించని విధంగా టిఆర్ఎస్ వచ్చింది. దీంతో వారు అనుకున్న, ఆశించిన స్ధానాల కంటే ఎక్కువ స్ధానాల్లోనే విజయం వరించింది. అయితే ఇప్పుడు పరిస్ధితులు మారాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఆంధ్రులలో సానుకూలత వ్యక్తం కావడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు, ఎంపీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇక్కడి సెటిలర్లలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఈసారి ఆంధ్రులు దూరంగా ఉంటారనే వార్తలూ వస్తున్నాయి. ఈ కీలక సమయంలో ఆంధ్రులు ఎటువైపు ఉంటారో వారినే విజయం వరించే అవకాశం ఉంది. అందుకే ఆంధ్రులారా మీరెటు వైపు అని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూపులు చూస్తున్నాయి. ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గెలుపు అంత సులువేం కాదని ఆయన ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం... అనంతర విలేకరుల సమావేశం చెప్పకనే చెబుతున్నాయి.