లిమిట్స్ దాటుతున్న కేసీఆర్!

 

 

 

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని స్పష్టంగాతెలుస్తున్నప్పటికీ కేసీఆర్ తన దర్పాన్ని ఎంతమాత్రం వదిలిపెట్టడం లేదు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం సీమాంధ్రులను సోదరుల్లా భావిస్తాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులూ కలిగించమని చెప్పిన కేసీఆర్ ఈమధ్య కాలంలో మళ్ళీ వాయిస్ పెంచుతూ వస్తున్నాడు. ఎన్నికల వేడి పెరుగుతున్నకొద్దీ సీమాంధ్రుల గుండెలు మండిపోయే విధంగా స్టేట్ మెంట్లు ఇస్తున్న కేసీఆర్, తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నాడు.

 

తన ప్రభుత్వం రాగానే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ తెలంగాణ ప్రజల్ని మరిన్ని భ్రమల్లో ముంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే ఒప్పుకోమంటూ కేసీఆర్ చేసిన ప్రకటన సీమాంధ్ర ఉద్యోగులలో ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. తెలంగాణ తెచ్చిన బిల్లు మంచిదేగానీ, ఆ బిల్లులో వున్న ‘ఆప్షన్లు’ అనే పదం మాత్రం కేసీఆర్‌కి నచ్చకపోవడం దారుణమని వారు అంటున్నారు. ఇదిలా వుంటే, లిమిట్స్ దాటడంలో డాక్టరేట్ కేసీఆర్ తన స్థాయికి మించిన పనులు మొదలుపెట్టాడు.


అత్యంత సున్నితమైన అంశాలలో కూడా ఎంటరైపోతున్నాడు. న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నాడు. అత్యంత పకడ్బందీగా, రాజ్యాంగబద్ధంగా జరిగే న్యాయమూర్తుల నియామకాల మీద కూడా కామెంట్లు చేస్తూ, లేఖలు రాసే సాహసం చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే జూన్ 2వ తేదీలోపు న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టకూడదంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తాకి లేఖ రాశాడు. జూన్ 2 లోపు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేపడితే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో గగ్గోలు పెట్టాడు. న్యాయ వ్యవస్థకి కూడా ప్రాంతీయ విభేదాల జాడ్యాన్ని అంటగట్టడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను న్యాయ నిపుణులు చిరాకుగా చూస్తున్నారు.