కేసీఆర్ గజ్వేల్‌ నుంచి కష్టమేనట.!!

 

ఎన్నికలకు 8 నెలల సమయమున్నా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు శ్రీకారం చుట్టారు. ఈసారి 60, 70 కాదు ఏకంగా వందకి పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి తెరమీదకు వచ్చిందో అప్పటినుంచి ఆ ధీమా తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది. టీడీపీ కూడా నాయకులు దూరమైనా పలుచోట్ల కేడర్ బలంగానే ఉంది. మరి ఈ రెండు పార్టీల బలం ఒక్కటైతే తెరాసకు ఇబ్బంది తప్పదు. దీంతో మొన్నటివరకు వచ్చే ఎన్నికల్లో తెరాసదే విజయం అని బల్లగుద్ది చెప్పినవాళ్లు కూడా.. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుంది పోరు అనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ ని మహాకూటమి బాగా ఆలోచనలో పడేస్తుంది. అందుకే ఆయన మహాకూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని, టీడీపీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈ మహాకూటమిని ఎలా ఎదుర్కోవాలని వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారట.

2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. అయితే ఆయనకి ఆ విజయం అంత ఈజీగా రాలేదు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంటేరు ప్రతాప్‌రెడ్డి.. కేసీఆర్ గట్టి పోటీనే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 44 % ఓట్లు సాధించగా.. ప్రతాప్‌రెడ్డి 34% ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన నర్సారెడ్డి 17 % ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతాప్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీలు దగ్గరయ్యాయి. అంటే ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి బలం మరింత పెరిగింది. అదీగాక ఆయనపై ప్రజల్లో అభిమానం ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటాడని మంచి పేరుంది. దీంతో మహాకూటమి తరుపున ఆయన బరిలోకి దిగితే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. కేసీఆర్ ప్రతాప్‌రెడ్డి చేతిలో ఓడిపోతారని చెప్పలేం కానీ.. ప్రతాప్‌రెడ్డి మీద స్వల్పతేడాతో గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వేరే నేతలకి ఈ గెలుపు ఓకే కానీ.. సీఎం స్థాయి నేతలకు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి నేతలకు ఈ గెలుపు సరిపోదు. ఆయన లాంటి నేతలు భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలవాలి. అందుకే ఆయన అవసరమైతే వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.

మొన్నటివరకు ఆయన గజ్వేల్ తో పాటు.. మేడ్చల్ నుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ దృష్టి మాత్రం హరీష్‌రావు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మీద ఉందట. సిద్దిపేటలో తెరాసకి బలముంది. తిరుగులేని మెజారిటీ వస్తుంది. అందుకే కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగాలనుకుంటున్నారట. దీనివల్ల కేసీఆర్ తన నియోజకవర్గం గురించి ఏ ఆలోచనలేకుండా.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టొచ్చని భావిస్తున్నారట. మరి కేసీఆర్ మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలని.. గజ్వేల్ నియోజకవర్గాన్ని వదిలేస్తారా?.. ఒకవేళ కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగితే మరి హరీష్ రావు ఎక్కడినుండి పోటీ చేస్తారు?.. గజ్వేల్ నుండి పోటీ చేస్తారా? లేక అసలు పోటీకి దూరంగా ఉంటారా? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.