స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఆత్మహత్యలా? కేసీఆర్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత!

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిపై పార్టీలో అసంతృప్తి పెరుగుతుందనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు ఎవరికీ నచ్చడం లేదని అంటున్నారు. ఎవరైనా ఏదైనా మంచి చెబితే వాళ్లను వెంటనే దూరం పెట్టేస్తున్నారని... మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా... అధికారులైనా ఇదే పరిస్థితి అంటూ చెప్పుకుంటున్నారు. కేసీఆర్ వ్యవహారశైలి, తీరు నచ్చక అసలు మాట్లాడేందుకకే ఎవరూ సాహిసించడం లేదని అంటున్నారు. కేసీఆర్ తీరుపైనా, ఆయన నిర్ణయాలపై స్వయంగా కేటీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఒక్కొక్కటిగా కేసీఆర్ చేస్తున్న తప్పులు కొండలా పేరుకుపోతున్నాయని, ఆయన నిర్ణయాలు... అటు పార్టీకి... ఇటు ప్రభుత్వానికి చేటు చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలే వాపోతున్నారట. కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ నిర్మాణం... కాళేశ్వరం వృథా పంపింగ్, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం... ఇలా అనేక నిర్ణయాలు చాలా మందికి నచ్చడం లేదట. ఇక, కొన్ని నిర్ణయాలైతే ఎవరికీ మింగుడుపడటం లేదని అంటున్నారు. అసలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు రావడానికి కేసీఆరే కారణమంటున్నారు. హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్సే.... బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఇక, యూపీఏ అధికారంలోకి వస్తుందన్న అతి నమ్మకంతో కేసీఆర్ ముందుకు తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం బెడిసికొట్టిందంటున్నారు. కేసీఆర్ వ్యవహార శైలి కారణంగానే కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాల్లేవని అంటున్నారు.

ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలోనూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రమంతా రగిలిపోతోందని, మరీ ఇంత కఠిన వైఖరి మంచిది కాదని అంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఏదోఒకరకంగా సమ్మె విరమింపజేయకుండా... ప్రభుత్వం ఇలా మొండిగా వ్యవహరించడం సరికాదంటున్నారు. అసలు కేసీఆర్ నిర్ణయాలను గులాబీ నేతలే జీర్జించుకోలేకపోతున్నారట. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సాధించిన స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాము అనుకోలేదని వాపోతున్నారట. కనీసం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ సమ్మె ఉగ్రరూపం దాల్చితే మాత్రం ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి, కిందస్థాయి నేతలు, కేడర్ మనోభావాలు కేసీఆర్ వరకు చేరతాయో లేదో చూడాలి.