ఆర్టీసీ రేట్లకే ప్రైవేట్ బస్సులు... 5100 బస్సులకు గ్రీన్ సిగ్నల్

 

మొత్తం 5,100 ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా తెలంగాణ సర్కార్ రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఇవాళే ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతుంది. అయితే ప్రైవేటు బస్సులను ఆర్టీసీ చార్జీలతోనే నడపాలని తెలిపింది. హైదరాబాద్ లో తిరిగే బస్సులకు కనీస చార్జీ 5 రూపాయలుగా ఉంది. సెట్విన్ బస్సుల్లో పదిరూపాలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల చార్జీలు రెట్టింపు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ లకు ఆర్టీసీ చార్జీలు నచ్చుతాయా..? వారికి గిట్టుబాటు అవుతుందా..? స్టేజి క్యారేజి పర్మిట్ లు తీసుకోవటానికి వారు ముందుకొస్తారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ఆర్టీసీలో  10,460 బస్సులున్నాయి. వీటిలో 2,103 అద్దె బస్సులు, 2,609 ఆర్టీసి సొంత బస్సులకు కాలం చెల్లింది. మరో 400-500 ల బస్సులకు మూడు నాలుగు నెలల్లో కాలం చెల్లనుంది. ఇవన్నీ కలిపి 5,100 వరకూ అవుతాయి.  కొత్త బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దాంతో ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. ఆర్టీసీ ఆధీనంలో ఉన్న రూట్లలో ఇవి స్టేజీ క్యారేజీలుగా నడుస్తాయి. ఒక రూట్ లో ఉన్న ప్రతి గ్రామం దగ్గర ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించటం పద్ధతిలో స్టేజీ క్యారేజీలుగా నడుస్తాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడిచే 3,726 రూట్లలో కొన్నింటిలో మాత్రమే ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు ఇచ్చేలా అధికారులు కొత్త విధానాన్ని రూపొందించారు. ఇవి ఆర్టీసీ చార్జీలతో నడుస్తాయి. వాటిని రవాణా శాఖ నియంత్రిస్తుంది.

ప్రస్తుతం అద్దె బస్సులకు కిలో మీటర్ కు 6 నుంచి 11 రూపాయల చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది. ప్రతి బస్సు రోజుకు 280 కిలో మీటర్ లు తిరగాలనే నిబంధన ఉంది. టికెట్ ఆదాయం ఆర్టీసీకే చెందుతుంది. ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు ఇస్తే ఆ ఆదాయం రవాణా శాఖకు సమకూరనుంది. పర్మిట్ల ఫీజులు ఎలా నిర్ధారిస్తారన్నది తేలాల్సి ఉంది. 22 సీట్లు.. 40 సీట్లతో ఉన్న ప్రైవేటు బస్సులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఐటి ఉద్యోగులను వారి కంపెనీలకు చేరుస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలలోనే ఇలాంటి బస్సులున్నాయి. ఇవి ఒక్కో సీటుకు రూ.1210 రూపాయల చొప్పున త్రైమాసిక పన్నును రవాణా శాఖకు చెల్లిస్తున్నాయి. ఇవి కాకుండా టూరిస్టు బస్సులు మాత్రం సీటుకు  రూ.896 రూపాయల చొప్పున త్రైమాసిక పన్ను చెల్లిస్తున్నాయి. ఇలాంటి బస్సులు రాష్ట్ర పరిధి దాటితే అదనంగా రూ.700 రూపాయల చొప్పున పన్ను చెల్లించాలి. ఇలాంటి బస్సులను స్టేజీ క్యారేజీలుగా తీసుకోవాలంటే ఎంత పన్ను నిర్ధారిస్తారన్నది ఇంకా తేలలేదు. దీనిపై రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.