చంద్రబాబుకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్.. ఇకనుంచి గిఫ్ట్ లే గిఫ్ట్ లు!!

 

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుంటే ప్రధాన పార్టీల్లో చేరికలు, వలసలు సహజం. ప్రస్తుతం ఏపీలో కూడా అదే జరుగుతుంది. తాజాగా కడప జిల్లాకు చెందిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ ని కలిశారు. ఆఫీసియల్ గా వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే మేడా టీడీపీని వీడడం వెనుక జగన్ పాత్ర ఎంతుందో తెలీదు కానీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర మాత్రం గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే మొదటి గిఫ్ట్ గా కేసీఆర్.. మేడాను టీడీపీకి దూరం చేసినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల సమయంలో మేడా టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ దక్కడం.. కడప జిల్లాలో టీడీపీ ఘోర ఓటమి చవిచూసినా.. ఆయన మాత్రం జిల్లా నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిపోయాయి. కడప జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం మేడాకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్ తో సరిపెట్టారు. దీంతో మేడాలో అసంతృప్తి విత్తనం మొలకెత్తింది. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో మేడా అసంతృత్తి ఆగ్రహంగా మారింది. పార్టీ తరుపున గెలిచిన తనకి మంత్రి పదవి ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటంటూ.. సన్నిహితులు, ఇతర టీడీపీ నేతల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మేడాని బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగి.. మేడా తండ్రికి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశమిచ్చారు. అయినా మేడా శాంతించలేదు. పార్టీ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. 

దీన్నే వైసీపీ తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. మేడా టీడీపీని వీడి వైసీపీలో చేరేలా పావులు కదపడం మొదలుపెట్టింది. అయినా మేడా సందిగ్ధంలోనే ఉన్నారు. వైసీపీలో చేరాలా? వద్దా? ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగి ఒక్క ఫోన్ కాల్ తో మేడా టీడీపీని వీడేలా చేశారట. అసలు మేడా కేసీఆర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటనేగా మీ డౌట్. మేడా పెద్ద కాంట్రాక్టర్. కేసీఆర్ సహకారంతో ఆయన తెలంగాణలో చాలా కాంట్రాక్టులు చేస్తున్నారట. మరి తనకి కాంట్రాక్టులు ఇచ్చిన కేసీఆర్ మాటకి ఆ మాత్రం విలువ ఇవ్వాలి కదా. అసలే టీడీపీ మీద అసంతృప్తి, దీనికితోడు కేసీఆర్ ఫోన్ కాల్.. ఇంకేముంది మేడా వెంటనే టీడీపీకి గుడ్ చెప్పేశారట. మొత్తానికి మేడా రూపంలో కేసీఆర్ చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇది ఇంతటితో అయిపోలేదట. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను టీడీపీని వీడి వైసీపీలో చేరేలా చేస్తానని కేసీఆర్ జగన్ కి హామీ ఇచ్చారట. తాజాగా వైసీపీ బొత్స సత్యనారాయణ మాటలు వింటే ఇది నిజమనే అభిప్రాయం కలగక మానదు. తాజాగా బొత్స మాట్లాడుతూ.. మేడా మల్లిఖార్జున రెడ్డి మాత్రమే కాదనీ ఇంకా చాలామంది టీడీపీ నుంచి బయటకు వస్తారని అన్నారు. దీనిబట్టి చూస్తుంటే వైసీపీ కేసీఆర్ తో కలిసి టీడీపీకి షాకులు మీద షాకులు ఇచ్చేలా ఉంది. చూద్దాం మరి ముందు ముందు కేసీఆర్ చంద్రబాబుకి ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తారో ఏంటో.