కేసీఆర్ కు తలనొప్పిగా మారిన జగన్ నిర్ణయం!!

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారం లోకి వచ్చిన వెంటనే ఆయా వర్గాల వారికి మేలు చేసేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ లో ప్రభుత్వ, ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొనడం కేసీఆర్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ నూతన మంత్రి వర్గ సమావేశం లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐ ఆర్ ప్రకటించిన జగన్ , సీపీస్ రద్దుకు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు తక్షణమే తమకు ఐ ఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సీపీస్ పెన్షన్ స్కీమ్ రద్దుకు సిఫార్స్ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, తమ డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించిన ఉద్యోగ సంఘాలకు నిరాశే ఎదురయింది. మంత్రి వర్గ సమావేశ అనంతరం మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఉద్యోగుల సమస్యల అంశాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించగా లేనిది, తెలంగాణ సర్కార్ ఎందుకు ప్రకటించదని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏపీ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోవడంతో , తెలంగాణ ఉద్యోగులు మౌనంగా ఉన్నారు. కానీ జగన్ ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడంతో తమకు కూడా ఐఆర్ ప్రకటించాల్సిందేనని తెలంగాణ ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు.

అదేవిధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ సదుపాయం కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది నేటి నుంచే అమలులోకి వచ్చింది. క్షణం తీరికలేకుండా పగలు, రాత్రి, ఎండ, వాన అని తేడా లేకుండా విధినిర్వహణలో ఉండే ఏకైక ప్రభుత్వ శాఖ పోలీస్‌ శాఖ. వీక్లీ ఆఫ్ లేకపోవడంతో ఉద్యోగ రీత్య మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కుటుంబజీవితాన్ని కూడా కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు జగన్ వీక్లీ ఆఫ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. ఏపీ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం కూడా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ అంటూ కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు కానీ దానిని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇప్పుడు ఏపీ సీఎం ఆచరణలోకి తెచ్చి చూపడంతో.. తెలంగాణ పోలీసు వర్గాలు మాకెప్పుడు వీక్లీ ఆఫ్ అంటూ కేసీఆర్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.