టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తారకరామారావు

 

టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నియమించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ అత్యంత కీలకంగా వ్యవహరించి విస్తృత ప్రచారం చేపట్టారు. అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తేవడంలో విజయవంతమయ్యారు. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూడా పార్టీకి కేటీఆర్‌ ఘన విజయం అందించిన విషయం తెలిసిందే. అలాగే‌ గత ప్రభుత్వంలో తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖలను కూడా ఆయన సమర్థంగా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్ణయంతో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను తూ.చా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్‌ అత్యంత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉంది. భారతదేశంలోనే అతిగొప్ప పార్టీగా టీఆర్ఎస్‌ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు.