రాజుగారు కారెక్కుతారా..?

2019 ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు కారు స్పీడును ఎవరూ ఆపలేరని చెబుతున్నప్పటికీ ఆయన మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు అనుకున్నారేమో గానీ..పార్టీకి అక్కడక్కడా ఉన్న లోటుపాట్లను సవరించే పనిలో పడ్డారు. మిగిలిన అన్ని పార్టీలతో పోలిస్తే గులాబీ దండుకి సినీ గ్లామర్ చాలా తక్కువ. అప్పట్లో విజయశాంతి..ఇప్పుడు బాబు మోహన్ తప్పించి మరోకరు లేరు. కానీ వారికి ఎన్నికల్లో ఓట్లు వేయించగల ఛరిష్మా లేదు. దీంతో ఆ లోటు పూడ్చేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్ వరుస పెట్టి సినిమా వాళ్ల ఫంక్షన్లకు హాజరవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

అలాగే టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా వెలుగొందుతున్న దిల్‌రాజు‌ను కేసీఆర్ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.  పరిశ్రమలో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు చాలా తక్కువ. ఇలాంటి వారిలో దిల్‌రాజు ముందు వరుసలో ఉంటారు. స్వతహాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు టీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం..టాలీవుడ్‌ను ప్రభావితం చేయగల స్థాయిలో ఉండటంతో ముఖ్యమంత్రి.. రాజుగారిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన బ్యానర్‌లో వచ్చిన ఫిదా మూవీని స్వయంగా చూసిన కేసీఆర్ తెలంగాణ యాస, భాష గొప్పగా ఆవిష్కరించారని ప్రశంసించారు.

 

సీఎం కోరిక మేరకు దిల్‌రాజు టీఆర్ఎస్‌లో చేరితే నిజామాబాద్ లేదా జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయిస్తారట. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కవిత ఎమ్మెల్యేగా వెళితే ఆ స్థానాన్ని దిల్‌రాజు‌కి ఇవ్వాలన్నది కేసీఆర్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే విజయవంతమైన నిర్మాతగా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తోన్న రాజు గారు రాజకీయాల్లోకి వెళతారా అన్నది తెలియదు. ఈ ఏడాది శతమానం భవతి, నేనులోకల్, డీజే, ఫిదాలతో బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుని ఫుల్‌జోష్‌లో ఉన్న ఈ టైంలో ఆయన సినిమాలను విడిచిపెడతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఊహాగానాలకు తెర పడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.