మోదీ, టీ బీజేపి… మధ్యలో కేసీఆర్ చాతుర్యం!

         

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం భలే తెలివిగా వుంటుంది. అసలు ఆయన ఎవర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తారో, ఎవర్ని ఎప్పుడు మెచ్చుకుంటారో ఎవ్వరికీ అర్థం కాదు. కాని, ఆయనకు మాత్రం ప్రతీ దాంట్లో ఓ క్లారిటీ వుంటుంది! ఇన్ ఫ్యాక్ట్, కేసీఆర్ ఎవర్నైనా తిట్టినా, మెచ్చుకున్నా … సదరు వ్యక్తి అలెర్ట్ గా వుండాల్సిందే! అవును… కేసీఆర్ ఒక్కోసారి సానుకూలంగా మాట్లాడినా అందులో పెద్ద వ్యూహమే వుంటుంది!

 

మొదట నుంచీ తెలంగాణ ముస్లిమ్ లని ఆకాశానికి ఎత్తటంలో కేసీఆర్ ఛాంపియన్ అని నిరూపించుకుంటూనే వున్నారు. ఇక ఆ మధ్య అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముస్లిమ్ లకు పన్నెండు శాతం రిజర్వేషన్ అంటూ తీర్మానం అమోదింపజేశారు. దాన్ని కేంద్రానికి పంపి బాల్ బీజీపి కోర్టులోకి తోశారు. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరుల ముందు లేవనెత్తారు! మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు తాను ఇచ్చితీరుతానని శపథం చేశారు. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ముస్లిమ్ రిజర్వేషన్లకు మోదీ అనుకూలం అంటూ డైలాగ్ విసిరారు!

 

మోదీ ముస్లిమ్ రిజర్వేషన్లకు అనుకూలం అనేది ఒకటికి రెండుసార్లు విన్నా ఎవరూ నమ్మలేని విషయం. కాని, కేసీఆర్ అదే మాట ఇఫ్తార్ విందుకి వచ్చిన బీజేపి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముందు అన్నారు! ఇంతకీ నిజం ఏంటి? కేసీఆర్ ముస్లిమ్ రిజర్వేషన్ల హడావిడి జరుగుతున్నప్పుడే ఓ మీటింగ్ లో మోదీ ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి చేయూత అవసరం అన్నారు. అదే విషయాన్ని కేసీఆర్ తనదైన రీతిలో ఇఫ్తార్ కొచ్చిన ముస్లిమ్ ల ముందు చెప్పారు! వెనుకబడిన ముస్లిమ్ లకు రిజర్వేషన్ల విషయంలో మోదీ అనుకూలం. కాని, ఆయన గాని, ఆయన పార్టీ అయిన బీజేపీగాని మొత్తానికి మొత్తంగా ముస్లిమ్ సమాజానికి రిజర్వేషన్లకు వ్యతిరేకం! ఈ విషయం కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు!

 

అసలు కేసీఆర్ పదే పదే చెబుతోన్న ముస్లిమ్ రిజర్వేషన్లు కూడా మతం ఆధారంగా ఇస్తోన్నవి కావనీ… ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి మాత్రమే బీసీ వర్గంలో చేర్చి ఇవ్వనున్నారని వాదించే వారు కూడా వున్నారు. ఏది ఏమైనా, కేసీఆర్ ముస్లిమ్ రిజర్వేషన్ ఓసారి , ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి రిజర్వేషన్ అని ఓసారి మాటల చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా దత్తాత్రేయ హాజరైన మీటింగ్ లోనే మోదీ అనుకూలం అనేశారు! మరి దీనిపై తెలంగాణ బీజేపి ఎలా స్పందిస్తుందో చూడాలి! జనానికి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం, ముస్లిమ్ రిజర్వేషన్ల అంశంపై… మోదీ మాట వేరు, తెలంగాణ బీజేపి పోరాట బాట వేరు అనుకునే ప్రమాదం వుంది!