కేసీఆర్‌ సర్కార్‌కి దెబ్బ మీద దెబ్బ... తప్పెక్కడ జరుగుతోంది?

 

తెలంగాణ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అనేక నిర్ణయాలపై కోర్టులు అక్షింతలు వేయగా.... తాజాగా మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తూ... టీ-సర్కార్‌ విడుదల చేసిన జీవోపై అభ్యంతరం తెలిపింది. సరైన ఎంపిక ప్రక్రియ లేకుండా... ఎలా క్రమబద్దీకరిస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. 1996 తర్వాత కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు పొందిన వారిని... క్రమబద్దీకరించొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

 

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని... టీఆర్ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తూ... జీవో 16 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను క్రమబద్దీకరించి నియామకాలు చేసింది. అయితే నాలుగు వేల జూనియర్ లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా... కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడాన్ని నిరుద్యోగులు తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోతున్నామని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అటు టీ-సర్కార్ ప్రతినిధులు, ఇటు నిరుద్యోగులు హైకోర్టు ముందు వాదనల్ని వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో క్రమబద్దీకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

 

అలాగే తెలంగాణ భూసేకరణ చట్టం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అనేక లోపాలను ఎత్తిచూపిన  కేంద్ర న్యాయశాఖ... బిల్లును వెనక్కిపంపింది. ముఖ్యంగా తెలంగాణ భూసేకరణ, పునరావాస చట్టం 2014 జనవరి నుంచే అమల్లోకి వచ్చినట్లు బిల్లులో ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 2014 జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.... 2014 జనవరి నుంచే చట్టం ఎలా అమల్లోకి వస్తుందని ప్రశ్నించింది. బిల్లులో అనేక లోపాలను ఎత్తిచూపడంతో తెలంగాణ సర్కార్‌ ఇరకాటంలో పడింది. భూసేకరణ బిల్లులో మళ్లీ మార్పులు చేర్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపడానికి వర్క్‌ జరుగుతోంది. అయితే కీలక నిర్ణయాల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడానికి అధికారుల కసరత్తులో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో హడావిడిగా ముసాయిదా బిల్లులు, జీవోలు రూపొందించడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని ప్రభుత్వం భావిస్తోంది.