పదే పదే ఫెయిలవుతోన్న తెలంగాణ విద్యాశాఖ!


2014లో సరికొత్త రాష్ట్రంగా ఏర్పాటైంది తెలంగాణ. అయితే, సాధారణంగా బాలారిష్టాలన్నీ కొత్త రాష్ట్రానికి వుంటాయి. కాని, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం అంతా రివర్స్. అవశేష రాష్ట్రమైన ఏపీకే చిక్కులన్నీ వచ్చిపడ్డాయి. రాజధాని నిర్మించుకోవటం దగ్గర్నుంచీ చాలెంజ్ లు అన్నీ ఆంధ్రాకే ఎదురయ్యాయి. కేసీఆర్ తొలి రోజు నుంచే పూర్తి స్థాయి సీఎంగా అన్ని హంగులతో తెలంగాణను ముందుకు నడుపుతున్నారు. అయినా కూడా కొన్ని రంగాల్లో సమైక్యాంధ్రప్రదేశ్ లో లేని అపశృతులు  ప్రత్యేక తెలంగాణలో కనిపిస్తున్నాయి...

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైనా శాఖ పదే పదే తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచింది అంటే... అది విద్యా శాఖే! కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతృత్వంలో నడుస్తోన్నప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టరీ ఎప్పుడూ కలకలం రేపుతూనే వుంది. అత్యంత తాజా గందరగోళం టెన్త్ ఫిజిక్స్ పేపర్! అసలు ఎంతో ప్రధానమైన పదవ తరగతి పేపర్ చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. కాని, జాగ్రత్త మాట అటుంచితే కనీస స్పృహ కూడా లేకుండా ఫిజిక్స్ పేపర్ అచ్చేసినట్టు మనకు కనిస్తోంది. దాంట్లో పదవ తరగతి ప్రశ్నలు కాకుండా ఇంటర్ వి రావటం మొదలు అసలు పేపర్ చూసిన టెన్త్ విద్యార్థులు జుట్టు పీక్కునేలా వున్న మొత్తం సెటప్... ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారం నడిచిందో అర్థమయ్యేలా చేస్తుంది! అసలు స్కూల్ చదవు పూర్తి చేసుకుని కాలేజీ జీవితంలోకి ప్రవేశించే కీలకమైన దశలో వున్న విద్యార్థుల జీవితాలతో ఇలాగేనే ఆడుకునేది?

 

టెన్త్ పరీక్షల్లో ఒక పేపర్ లో తప్పులు దొర్లితే అర్థం చేసుకోవచ్చు. కాని, తెలంగాణ విద్యా రంగం ఈ మధ్య కాలంలో చాలా గందరగోళాల్లో చిక్కుకుని బయటపడుతూ వస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ మూడు సార్లు నిర్వహించిన ఎమ్ సెట్టే! ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులకి విద్యార్థులకి అవకాశం కల్పించే కీలకమైన ఆ పోటీ పరీక్ష కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది! ఇక మొన్నటికి మొన్న టీ సర్కార్ గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి వెనక్కు తీసేసుకుంది. ఇంత వరకూ దాని పై మళ్లీ క్లారిటీ లేదు!

 

గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయకపోవటం మొదలు ఇదుగో అదుగో డీఎస్సీ అంటూ కాలయాపన చేయటం వరకూ అంతా అగమ్య గోచరంగా వుంది తెలంగాణ విద్యారంగంలో! దీని వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరాశకి లోనవుతున్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటే... విద్యా రంగం. అందులో సరైన ప్రొత్సాహం లభించటం లేదనీ, చదువకున్న వారికి ఉద్యోగాలు రావటం లేదనీ యువత ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. కాని, స్వంత రాష్ట్రం వచ్చాక కూడా విద్యా,ఉద్యోగాల్లో పెద్దగా ఆశాజనకంగా పరిస్థితులు వుండటం లేదు.

 

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక వినూత్న పథకాలతో ముందకు పోతున్న కేసీఆర్ ముఖ్యమైన విద్యారంగంపై దృష్టి పెట్టాలి.  కేజీ టూ పీజీ అన్న ఆయన అందుకు తగ్గట్టు అధికారల్ని ఉరుకులు పరుగులు పెట్టించాలి. లేదంటే ఈ విద్యా శాఖలోని అవకతవకలన్నీ రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా వుంటుంది...