దటీజ్ కేసీఆర్

 

మొత్తానికి కేసీఆర్ అనుకున్నంతా చేశారు. జీవితకాల లక్ష్యాన్ని పదిహేనేళ్లలోనే సాధించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పొగిడించుకుని, ఆయన వద్ద నాలుగు కన్నీటి చుక్కలు రాల్చి, పాదాభివందంనం చేసి.. తిరిగొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నానా గడ్డీ కరిపిస్తున్నారు. తెలంగాణ ఇస్తే చాలు, సోనియా గాంధీ కాల్మొక్కుతా, ఆమె ఇంట జాడు (చీపురుకట్ట)తో తుడుస్తా అని ముందు కావల్సినంత కాలం చెప్పి, ఇప్పుడు విలీనం లేదు, గాడిదగుడ్డు లేదు పొమ్మన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏమీ చేయలేక రకరకాల పిల్లిమొగ్గలు వేస్తోంది. దానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మాటలే నిదర్శనం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తానని కేసీఆరే అన్నారని.. ఇప్పుడు విలీనం చేయకపోయినా తాము చేసేది ఏమీ లేదని చెప్పారు. అయితే దింపుడు కల్లం ఆశలాగ, పొత్తుల కోసం కె.కేశవరావు నేతృత్వంలో ఆయనో కమిటీ వేశారని, వాళ్లు తీసుకునే నిర్ణయం యూపీఏకు అనుకూలంగానే ఉండొచ్చని దిగ్విజయ్ చెప్పారు. తాము ఎన్నికల తర్వాత యూపీఏ కూటమిలోనే ఉంటామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు కూడా ఇప్పుడు చెప్పుకొంటున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన విలీనం మాట ఏమైపోయిందో చెప్పలేడు గానీ, ఎన్నికల తర్వాత పొత్తుల గురించి దిగ్విజయ్ మాట్లాడుతుంటే చూసేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు.

 

రాష్ట్ర స్థాయిలో ఒకసారి కాంగ్రెస్ పార్టీతోను, మరోసారి తెలుగుదేశం పార్టీతోను పొత్తులు పెట్టుకుని.. ఇంకా ఫలితాలు వెలువడక ముందే ఢిల్లీ వెళ్లి కమలనాథులతో కూడా మంతనాలు సాగించిన చరిత్ర కేసీఆర్ సొంతమన్న విషయం బహుశా దిగ్విజయ్ సింగ్ మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే, ఆయనకు పెద్దవయసు వచ్చింది కాబట్టి మతిమరుపు ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే ఇంకా కేసీఆర్ మాటలు పట్టుకుని వేలాడుతున్నారు. దటీజ్ కేసీఆర్..