కేసీఆర్ సడన్ సర్వే...భయపడ్డారా?


భయం అంటే ఏంటో తెలియదు... ఏం మాట్లాడిన ధైర్యంగా.. ముక్కు సూటిగా మాట్లాడతాడు..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడుకున్న ముందు చెప్పుకునే మాటలు ఇవి. మరి అలాంటి కేసీఆర్ భయపడ్డారా..? వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా..? లేదా..? అన్న భయంతో వెన్నులో వణుకు పుట్టుకొస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కేసీఆర్ అంతలా భయపడటానికి కారణం ఏంటనుకుంటున్నారా..? దానికి కారణం బీజేపీయే అంటున్నారు.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే తెలంగాణ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించి మంచి ఫాంలో ఉందన్న సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఉత్తరాదిన తమ సత్తా చాటుకున్న బీజేపీకి.. దక్షిణాదిన అంత ప్రజాదారణ లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు దక్షిణాదిన కూడా తమ ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే దక్షిణాదిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచితీరుతుందని కూడా చెప్పుకొచ్చారు అమిత్ షా.

 

అయితే అమిత్ షా పర్యటన కేసీఆర్ పై బాగానే ప్రభావం చూపినట్టు ఉంది. ఎందుకంటే ఇంత సడెన్ గా కేసీఆర్ సర్వే నిర్వహించడం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడం చూస్తుంటే.. కేసీఆర్ భయపడ్డారేమో అని అనుకుంటున్నారు. ఈరోజు టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగగా.. ఆ సమావేశంలో కేసీఆర్ సర్వే నివేదికను బయటపెట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని.. ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. మరి తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111 వస్తే తన మిత్రపక్షమైన ఎంఐఎం పరిస్థితి ఏంటని చర్చించుకునే వాళ్లు కూడా ఉన్నారు.

 

మరి అలా అమిత్ షా వెళ్లారో లేదో.. ఇలా కేసీఆర్ వెంటనే సర్వే అంటూ హడావుడి చేయడంతో.. బీజేపీ ని చూసి భయపడుతున్నట్టు ఉన్నారు అని అనుకుంటున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్టు కేసీఆర్ నిజంగానే భయపడ్డారా..? లేక మామూలుగానే సర్వే చేశారా..అన్నది కేసీఆర్ కే తెలియాలి.