సీఎం మనసులో సచివాలయం

కేసీఆర్.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కోట్లాది మంది ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేసిన పోరాట యోధుడు. ప్రజామోదంతో కొత్త రాష్ట్రానికి తొలి అధినేతగా బాధ్యతలు చేపట్టిన మొదలు వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలతో యావత్ దేశాన్ని ఆకర్షించిన నేత. నూతనత్వాన్ని ఇష్టపడతారో లేక మరేదైనా కారణమో కానీ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాత అనే పదాన్ని ఆయన ఇష్టపడటం లేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి చెందిన గుర్తులను ఒక్కొక్కటిగా చేరిపేస్తూ వస్తున్న ఆయన కన్ను సచివాలయం మీద పడింది.

 

సెక్రటేరియట్‌ శిథిలావస్థకు చేరుకుందని.. సిబ్బందికి అనువుగా లేదని దానిని కూల్చేసి మరో ప్రాంతంలో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కేసీఆర్‌‌ను ముందు నుంచి గమనిస్తున్నవారు మాత్రం ఆయనకు జాతకాలు, ముహుర్తాలు, వాస్తు శాస్త్రాలపై నమ్మకం ఎక్కువని.. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే సచివాలయాన్ని కూలగొడుతున్నారని చర్చించుకున్నారు. దీనికి కొద్ది రోజులు ముందే వాస్తు పేరు చెప్పి బేగంపేటలోని సీఎం కార్యాయంల పక్కనే ప్రగతిభవన్ అనే పేరుతో కొత్త అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు కేసీఆర్..

 

అయితే సచివాలయాన్ని కూల్చాలన్న సీఎం నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. ఎందరో ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించారని.. వారెవరికీ కనిపించని దోషం కేసీఆర్‌కు ఎలా కనిపించిందని మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కాస్త వెనక్కు తగ్గారు. అప్పటి నుంచి ఈ విషయం మరుగునపడిపోయింది. మీడియా, ప్రతిపక్షాలు అందరూ దీనిని మరచిపోయారు.

 

అయితే ఇన్ని రోజుల తర్వాత స్వయంగా .. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరాన్ని వివరించారు. దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదేనని.. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవనాలు కట్టేశారని పేర్కొన్నారు.. కనీసం ఒక్కటంటే ఒక్క బిల్డింగ్ కూడా నియమనిబంధనల ప్రకారం నిర్మించలేదని అన్నారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్ జంగిల్‌ అయిపోతుందని సభ్యులు మాట్లాడటం తగదన్నారు. ఆధునికంగా సచివాలయాన్ని నిర్మించాలనుకోవడం తప్పా..? మనకు ఆధునిక సచివాలయం అవసరం లేదా అని ప్రశ్నించారు.. మొత్తానికి ఏదైనా పనిలో వేలు పెడితే దాని అంతు చూడకుండా వదలని కేసీఆర్ మరోసారి తన తత్త్వాన్ని చాటి చెప్పారు.