మొక్కల్ని నాటుతున్నాం… వృక్షాల్ని కాపాడుకుంటున్నామా?

 

తెలంగాణ ప్రభుత్వం మూడో విడత హరిత హారం సంకల్పించింది. ఒకటి రెండు కాదు ఏకంగా 40కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. అంతే కాదు, అనేక అవార్డులు, రివార్డులు కూడా ఇవ్వనుంది. పచ్చదనాన్ని కాపాడే వారికి పసందైన గుర్తింపు గ్యారెంటీ అంటోంది! విద్యార్థులకైతే మొక్కల్ని కాపాడినందుకు 5మార్కులు కూడా ఇవ్వనున్నారట! అయితే, ఇదంతా మూడో విడతలో భాగం! అంటే… ఇప్పటికే రెండు విడతల హరిత హారం జరిగిపోయిందన్నమాట!

 

ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా, యావత్ ప్రపంచానికి కూడా పచ్చదనానికి మించిన అవసరం అంటూ ఏదీ వుండదు. అటువంటి పచ్చదనం విషయంలో తెలంగాణ ప్రభుత్వం హరిత హారం యజ్ఞం తలపెట్టడం నిజంగా సంతోషించాల్సిందే! అయితే, ఇప్పటికే రెండు విడతలు హరిత హారం జరిగిపోయింది. మూడో విడత మళ్లీ మొదలైంది. కోట్ల మొక్కలు నాటుతున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. అసలు చాలా రాష్ట్రాల్లో మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం అనే అంశాలే పట్టించుకోవటం లేదు సీఎంలు, ఎమ్మెల్యేలు, అధికారులు. తెలంగాణలో ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మొక్కల ఉద్యమం నిర్వహించటం ఆనందకరం. కాని, చాలా మంది మనస్సుల్లో మాత్రం ఒకటే మెదులుతోంది. ఈ హరిత హారం ఫలితాలు ఎలా వున్నాయి అని!

 

మొదటి విడతని కూడా సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. మంత్రులు, కలెక్టర్లు పనిముట్లు పట్టుకుని గుంతలు తోడి మొక్కలు నాటారు. హడావిడి అద్బుతంగా జరిగింది. కాని, రాష్ట్రంలో ఈ తతంగం వల్ల పెరిగిన పచ్చదనం ఎంత? సరైన స్పష్టత లేదు! అలాగని, ప్రభుత్వం చేపట్టిన హరిత హారం పూర్తిగా నిరుపయోగం అని కూడా చెప్పలేం. నాటిన మొక్కలు క్రమంగా పెరుగుతూనే వుంటాయి. సరైన ఆలనా,పాలనా వుంటే చూస్తుండగానే వృక్షాలై చల్లటి నీడని, స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. కాని, ప్రతీ సంవత్సరం స్కూళ్లు తెరిచి పిల్లలు బడులకి వెళ్లే సమయంలో జరుగుతోన్న హరిత హారం తరువాత ఎక్కడా ప్రస్తావనకు రావటం లేదు. మరి నాటిన మొక్కలు ఏమవుతున్నాయి? ఇదే పెద్ద ప్రశ్న!

 

కేసీఆర్ సర్కార్ ఊరికే మొక్కలు నాటడం కాకుండా బహుమతులు, అవార్డులు, రివార్డులు కూడా ప్రకటిస్తోంది హరిత హారం సందర్భరంగా. పచ్చదనం విషయంలో చక్కగా పని చేసిన గ్రామ పంచాయితీలు, ఉత్తమ కాలేజీలు,పాఠశాలలు అంటూ… ఇలా రకరకాల కేటగిరిల్లో పచ్చదనాన్ని సత్కరిస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే అయినా ప్రభుత్వం పెట్టుకున్న 33శాతం పచ్చదనం ఆశయం నెరవేరాలంటే మరిన్ని గట్టి ప్రయత్నాలు అవసరం. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు… ఇలా అన్ని వర్గాల వారు మొక్కలు నాటినా పచ్చదనం అమాంతం పెరిగిపోవటం సాధ్యం కాదు. నిజమైన హరిత హారం అడవుల్ని భద్రంగా కాపాడుకుంటూ అటవి భుమూల శాతం పెరిగేలా చూస్తేనే కుదురుతుంది. తెలంగాణ ప్రభుత్వమే కాదు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, భారత దేశ ప్రభుత్వం కూడా ఈ దిశగా దృష్టి పెట్టాలి. మనం మొక్కలు నాటాల్సిన అవసరం ప్రకృతిలో లేనేలేదు. మనిషి ఖాళీ స్థలం ప్రకృతికి వదిలేస్తే ఒకటి రెండు దశాబ్దాల్లో అడవి దానంతటదే దట్టంగా అలుముకుంటుంది! సమస్యంతా మనిషి అడవుల్లోకి జొరబడి వృక్షాలు, మహా వృక్షాలు నరికి… మళ్లీ మొక్కలు నాటడంలోనే వుంది! ఈ పద్దతి మారకుంటే హరిత హారం అసాధ్యం!

 

సీఎం కేసీఆర్ ఇప్పుడు మొక్కలు నాటడం పై దృష్టి పెట్టినప్పటికీ సంవత్సరం పొడవునా అడవుల అభివృద్ధిపై , వృక్షాల నరికివేత అరికట్టడంపై దృష్టి పెట్టాలి. అదే నిజంగా పర్యావరణానికి మేలు చేసేది!