కేసీఆర్ కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేశారా?

 

రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతుంటే తెలంగాణ ఉద్యమాలు వేడి మాత్రం పూర్తిగా చల్లబడిపోవడంతో కాంగ్రెస్ నేతలందరికీ మళ్ళీ నోరు విప్పే దైర్యం కలిగిస్తోంది. వాయలార్ రవి వేసిన తెలంగాణా దోశని చాలా తేలికగా జీర్ణించుకొన్న తెరాస నేతలను చూసిన తరువాత కాంగ్రెస్ నేతలకు మరింత దైర్యం వచ్చిందిపుడు. పైగా తెరాస నేతలప్పుడు తమ తెలంగాణా ఉద్యమాలను పక్కన బెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల ప్రయత్నాలలో పడటంతో ఇప్పుడు వారిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి మరింత దైర్యం చిక్కింది.

 

ఖమ్మం కాంగ్రెస్ యంపీ రేణుకా చౌదరి నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెరాస పార్టీ తెలంగాణా ఉద్యమాలను ఒక పెద్ద వ్యాపారంగా మార్చుకొందని టీబీ, కేన్సర్, గుండెపోటు వంటి జబ్బులతో చనిపోయినవారిని కూడా తెలంగాణా కోసం ఆత్మబలిదానాలుగా చిత్రిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణా కోసం నిజంగా ఆత్మహత్యలు చేసుకొన్న యువత మరణాలకు మాత్రం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్యమాలు నడిపిస్తున్న కేసీఆర్ దే బాధ్యత అని ఆమె అన్నారు. కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధి ఓడిపోవడమే తెరాసపై అది చేస్తున్న ఉద్యమాలపై తెలంగాణా ప్రజలు క్రమంగా నమ్మకం కోల్పోతున్నట్లు ఋజువు చేస్తోందని ఆమె అన్నారు.

 

తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా ఉద్యమాల పేరిట కాంగ్రెస్ పార్టీని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? అని మీడియా అడిగిన మరో ప్రశ్నకు ఆమె ఖండించకపోగా ఆ సంగతి ఆయననే అడగండి అని జవాబు చెప్పడం, మీడియా సందేహాలు నిజమేనని ఆమె చెప్పకనే చెప్పినట్లు భావించవలసి ఉంటుంది.

 

కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ కూడా యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సమాజ్ వాది అధినేత ములాయం సింగు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించినట్లే, ఇప్పుడు రేణుకా చౌదరి కూడా కేసీఆర్ కు వ్యతిరేఖంగా ఆరోపిస్తున్నట్లు ఉంది.

 

తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా విదించుకొన్ననెలరోజుల గడువు వరకు కూడా తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి షరతుల గురించి మీడియాలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుండే కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా హాట్ లయిన్లో చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం అందరికి తెలిసిందే. గానీ, నెల రోజుల గడువు పూర్తయిన తరువాత కేసీఆర్ మాటలలో అకస్మాత్తుగా పెద్ద మార్పుకనబడింది. తానూ తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేందుకు సిద్దపడినా కూడా కాంగ్రెస్ (తెలంగాణా ఇచ్చేందుకు) ఒప్పుకోలేదని చెప్పడంతో అన్ని రాజకీయ పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి.

 

సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ అయితే మరో అడుగు ముందుకు వేసి అసలు కాంగ్రెస్ పార్టీ, తెరాసాలు తెలంగాణపై రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి, బేరాలు ఆడుకోవడానికి తెలంగాణా ఏమి వ్యాపార వస్తువు కాదు, నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలకు సంబందించిన సున్నితమయిన సమస్య, అసలు ఆ రెండు పార్టీలు ఏ అధికారంతో ఈ విధమయిన రహస్య ఒప్పందాలు చేసుకొంటున్నాయంటూ నిలదీశారు.

 

అయితే ఇటువంటి దుమారాల నుండి బయటపడటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన రహస్య ఒప్పందం పైనుండి అందరి దృష్టినీ మళ్ళించడానికి ‘ఎన్నికలు టికెట్స్’ అంటూ హడావుడి మొదలుపెట్టి తప్పించుకొన్నాడు.

 

అయితే, అతను తెలంగాణా ఉద్యమాలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని డబ్బు లేదా ఇతరత్రా ప్యాకేజీలకోసం డిమాండ్ చేసాడని, అవేవి కుదరకపోవడం చేతనే కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ మళ్ళీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాడని, ఇప్పుడు రేణుకా చౌదరి తన మాటలతో చెప్పకనే చెపుతున్నారు. బహుశః కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె మాటలను అందుకే ఇంతవరకు ఖండించలేదు.

 

తెలంగాణా కోసం తల నరుకొంటాన్నన కేసీఆర్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో పార్టీని గెలిపించుకొనే పనిలో తలమునకలయి ఉన్నాడు. కానీ, అతని మాటలను, అతని ఉద్యమాలను నమ్మిన యువత మాత్రం తమ చదువులు పాడుచేసుకోవడమే కాకుండా ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకొని కన్నవారికి జీవితకాలం తీరని దుఃఖం మిగిల్చారు. రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో సమిధలు కాకుండా విజ్ఞత చూపవలసిన బాద్యత ప్రజలదే.