తెలంగాణా ఉద్యమానికి శల్య సారధ్యం చేస్తున్నకేసీఆర్?

 

అలనాడు మహాభారతంలో రధం నడపడంలో ప్రవీణుడయిన శల్యుడిని తన రధసారధిగా చేసుకొంటే, యుద్ధంలో అవలీలగా విజయం సాధించగలననుకొన్న కర్ణుడిని, ఆ శల్యుడే రకరకాల ప్రశ్నలు వేస్తూ అతని శక్తి యుక్తులమీద అతనికే అపనమ్మకం ఏర్పడేలా చేసి, అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తీసి, చివరికి అతని ఓటమికి కారకుడయ్యాడు.

 

ఇక తెలంగాణా విషయానికి వస్తే కేసీఆర్ కూడా శల్య సారధ్యమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణా ఉద్యమం పతాక స్థాయికి చేరుకొన్న ప్రతీసారీ ఆయన తన ప్రసంగంతోనో, లేక రాజకీయ ఎత్తుగడతోనో దానికి బ్రేకులు వేయడమేగాకుండా వెనక్కి కూడా నడిపిస్తుంటారు. ఆయన ఒకసారి, హైదరాబాదు ఎవరికీ చెందాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని ఒక ప్రకటన చేసి తెలంగాణా ఉద్యమం చేస్తున్నపార్టీల గుండెల్లో ఒక బాంబు పేలుస్తారు, మరోసారి నోటికీ వచ్చినట్లు జాతీయ నాయకులను తూలనాడి, కాంగ్రెస్ వారిని ఉద్యమానికి దూరం చేస్తారు.

 

అందరిమీద పెత్తనం చెలాయిస్తూ, తెలంగాణాపై తనకొక్కడికే సర్వ హక్కులు ఉన్నట్లు మాట్లాడే ఆయన ధోరణివల్ల, తెలంగాణా జేయేసీలో చీలికలు సృష్టించి ఉద్యమానికి బ్రేకులు వేసిన పాపం ఆయనదే. అదే విధంగా మిగిలిన వారిని కాదని సమరదీక్ష సభలో పెత్తనం చేలాయించినందుకు భారతీయజనతా పార్టీతో సహా అనేక పార్టీలు తెలంగాణా జేయేసీకు క్రమంగా దూరం జరగడం మొదలుపెట్టాయి.

 

బహుశః కేసీఆర్ కోరుకొంటున్నది అదే కావచ్చును, ఎందుకంటే తెలంగాణా పోరాటం చేస్తున్నఖ్యాతి, దాని ఫలాలు తనకు, తన పార్టీకే దక్కాలనే దురాలోచనే ఆయనను ఇటువంటి పనులకు ప్రేరేపిస్తుంది. ఐకమత్యంగా చేయవలసిన ఉద్యమాన్ని, ముక్కలు ముక్కలుగా చేసిన పాపం కేసీఆర్ దేనని చెప్పక తప్పదు.

 

సమరదీక్షలోనే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడం గురించి కూడా మాట్లాడిన ఆయన, ఆ తరువాత వచ్చిన ప్రశ్నలకు జవాబు చెప్పకపోవడం కూడా ఆయన నిజాయితీని శంకించేల చేసింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసుకోవడానికి ఆయన ఏమి ప్యాకేజీ కోరారనే అంశం కూడా ఆమధ్య ప్రధానంగా చర్చింపబడింది.

 

కమునిష్టు నేత నారాయణ దానిపై స్పందిస్తూ, 4 కోట్ల మంది ప్రజలకి సంబందించిన తెలంగాణా అంశం కాంగ్రెస్-తెరాస అనే రెండు పార్టీల మద్య చేసుకోవలసిన ఒప్పందం కాదు. కాంగ్రెస్ పార్టీ ఆఫర్లు ఇవ్వడాన్ని, కేసీఆర్ బేరాలడుకోవడానికి అదేమీ వ్యాపారం కాదు, ప్రజల మనోభావాలకు సబందించిన సున్నితమయిన అంశం అని అన్నారు.

 

తెలంగాణా ఉద్యమంలో యదా శక్తిన పాటుపడుతున్న తెలంగాణా సమరభేరి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి కూడా కేసీఆర్ చిత్తశుద్దిని శంకిస్తూ మాట్లాడారు. ఉద్యమం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఉద్యమం బాట వదిలి ఎన్నికల బాట ఎందుకు పట్టింది అంటూ అయన ప్రశ్నించారు. కేసీఆర్ కూడా మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేస్తామని, పార్టీలో టికెట్స్ కావలసిన వారు వెంటనే పార్టీలో జేరి టికెట్ బుక్ చేసుకోండి అంటూ ఆఫర్లు కూడా ప్రకటించారు.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశాన్ని ఎన్నికల వరకు సాగదీయగలిగితే తనకి లాభం అని అనుకొంటే, గమ్మతుగా కేసీఆర్ కూడా అదే కొంటున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఆడుతున్న తెలంగాణా చదరంగంలో అమాయుకులయిన విద్యార్ధులు అన్యాయంగా బలయిపోతున్నారు. తమ బిడ్డలు చనిపోతున్నారని వేదికలెక్కి ఆక్రోశించే పెద్దమనుషులు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలని ఆలోచించకుండా, ప్రభుత్వానిదే బాధ్యత అంటూ చేతులు దులుపుకోవడం చాలా గర్హనీయం.

 

తెలంగాణా కావాలనుకొంటే రాజకీయ పోరాటాలు చేసుకోవచ్చు. ఆ పేరుతొ ఎన్నికలకు వెళ్ళినా ఎవరికీ నష్టం ఉండదు. గానీ, ఆమాయకులయిన ప్రజల జీవితాలతో, బంగారు భవిష్యత్ నిర్మించుకోవలసిన యువత జీవితాలతో ఆడుకోవడమే దారుణం.