కేసీఆర్ ప్రేలాపనల ఉద్దేశ్యం ఏమిటో?

 

ఇంతవరకు తెలంగాణా ఉద్యామానికి తానొక్కడే పూర్తీ హక్కులు కలిగి ఉన్నట్లు, తెలంగాణా కాంగ్రెస్, తెలంగాణా తెదేపా, బీజేపీ మొదలయినవన్నీ తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నపటికీ ఆ పార్టీ నేతలను ఏదో ఓసమయంలో కించపరుస్తూనే,వారందరూ తెలంగాణా విషయంలో తననుసరించవలసిందే తప్ప తనకన్నా ముందు నడువరాదన్నట్లు ప్రవర్తించడం అలవాటయిన కేసీఆర్, మొన్న సమరదీక్ష అనంతరం జాతీయ నాయకులూ సైతం తన ముందు బలాదూర్ అన్నట్లు మాట్లాడి ప్రజాగ్రహానికి గురయ్యాడు. అయితే, ఇటువంటి మాటలు అతనికి కొత్త కాకపోయినా, అవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తుండటం అతనికి అలవాటు. ఇప్పుడు అతను ఏఉద్దేశ్యంతో ఆవిధంగా మాట్లాడేడో చూస్తే, దానికి కొన్ని కారణాలు కనబడుతాయి.

 

కేసీఆర్ తన ప్రేలాపనలతో, అతను తెలంగాణా రావాలని కోరుకోవట్లేదనే వాదనకు బలం చేకూరింది. ఇప్పటికే అతను 2014 ఎన్నికల గురించి చాలాసార్లు మాట్లాడాడు గనుక, ఇప్పుడు ఈ విదంగా మాట్లాడి, కాంగ్రెస్ అధిష్టానాన్నికూడా గిచ్చితే, వారికి సహజంగానే కోపం కలిగి, రాష్ట్రంలో శాంతి భద్రతల కారణం చూపిస్తూ ఇంతవరకు తెలంగాణాపై వారు చేస్తున్న కసరత్తును పక్కన బెట్టేసే అవకాశం ఉంటుంది. తద్వారా కేసీఆర్ తెలంగాణాకి సైందవుడిలా అడ్డుపడ్డాడని చెప్పవచ్చును.

 

ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొంటే, వచ్చేఎన్నికల వరకూ తెలంగాణా అంశాన్ని అతను ఆపగలిగితేనే అతనిపార్టీకి అఖండ విజయం సిద్దిస్తుందని, అందువల్లనే కేసీఆర్ కోరుండే రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఈ విదంగా మాట్లాడి ఉండవచ్చునని భావించవచ్చును.

 

కేసీఆర్ తెలంగాణా ను అడ్డుకొనేందుకు చేసిన మరో ప్రయత్నం గురించి కూడా ఈ సందర్భంలో ప్రస్తావించక తప్పదు. అతను కొద్దిరోజుల క్రితం ఎవరూ అడుగకముందే, హైదరాబాదుపై ప్రజాభిప్రాయ సేకరణకు(రిఫరెండం) వెళ్దామని, స్వయంగా ప్రకటించడం కూడా తెలంగాణాను జాప్యం చేయడానికి చేసిన ప్రయత్నమేనని చెప్పవచ్చును. అయితే, ఆ ప్రతిపాదనను జేయేసీతో సహా అందరూ వ్యతిరేఖించడంతో ఆ విషయం అప్పుడు మరుగునపడిపోయింది. కానీ, అది అతని మనసులో ఆలోచనలను బయట పెట్టింది.

 

ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఈ విదంగా మాట్లాడటం ద్వారా తానూ కోరుకొన్నవిధంగానే స్పందనలు వచ్చాయి. తన మాటలతో విషం చిమ్మి రెండు ప్రాంతాల మద్య మరింత ద్వేషం పెంచగలిగాడు. తూరుపు జయప్రకాష్ రెడ్డి కేసీఆర్ ని , ప్రొఫెసర్ కోదండరాంలను ఓవైసీ సోదరులతో సరిపోలుస్తూ ఒవైసీలు ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చుపెడితే, కేసీర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మద్య చిచ్చుపెడుతున్నారని చెపుతూ, వారిరువురి మద్య తేడాలేదని అన్నారు. ఇంతవరకు అయన మాటలను ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా ఇప్పుడు కేసీఆర్ తన ప్రేలాపనలతో అయన మాటలను నిజం చేసినట్లయింది.

 

కేసీఆర్ కి వ్యతిరేఖంగా అనేక పోలీసు స్టేషన్లలో కేసులు వేయబడ్డాయి. అవి ముందుకు సాగుతాయ లేదా అనే విషయాన్నీ పక్కన బెడితే, అతను తన మాటలతో ఇరుప్రాంతాల ప్రజల మద్య ఇప్పటికే ఉన్న దూరాన్ని, విద్వేషాలను మరింత పెంచాడని అవి స్పష్టం చేస్తున్నాయి. ఒక ఉద్యమనేతగా, భాద్యతగల పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సరయిన మార్గ నిర్దేశం చేయవలసిన కేసీఆర్ తన మాటలతో ఉద్యమానికి కళంకం ఆపాదించాడు.

 

తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఈ విధంగా ప్రజలమద్య విద్వేషాలను రెచ్చగొట్టడం అతను మన ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాలు విసిరాడని చెప్పకతప్పదు. ఒకవేళ అతను, అతని పార్టీ ప్రస్తుతం తెలంగాణా వద్దని కోరుకొంటే, అదే విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా చెప్పి ఆపించుకోవచ్చును. తన పార్టీ రానున్న ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవాలని కోరుకొంటే అందుకు అతను ఇటువంటి ఆలోచనలకంటే ఇంతకంటే మేలయిన మరో ఆలోచన చేయడం మంచిది.