తెలంగాణ తల్లి లొల్లి!

 

 

 

 

తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కుటుంబమే ఇప్పుడు పెద్ద దిక్కయిపోయింది. తెలంగాణ నాలుగు దిక్కుల్లో ఏ దిక్కులో చూసినా కేసీఆర్ కుటుంబమే కనిపిస్తోంది. తెలంగాణ మొత్తం తమ కుటుంబం జాగీరులాగా కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వ్యూహరచనలు చేస్తోంది. మొన్నీమధ్య జరిగిన బతుకమ్మ ఉత్సవాలనే చూడండి. ఎక్కడ చూసినా కేసీఆర్ కూతురు కవితమ్మే. కవితమ్మ ఎక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నా ఛానెళ్ళన్నీ పోటీపడి లైవ్ కవరేజ్ ఇచ్చాయి.

 

టీఆర్ఎస్ వాళ్ళచేత సీమాంధ్ర ఛానెళ్ళంటూ తిట్లుతినే ఛానెళ్ళు కూడా కేసీఆర్ ఫ్యామిలీని మంచి చేసుకోవడానికేమో అన్నట్టుగా కవితమ్మ పాల్గొన్న బతుకమ్మ వేడుకలని ఒక్కక్షణం కూడా మిస్ కాకుండా కవర్ చేశారు. కవితమ్మ చేసిన బతుకమ్మ వేడుకల మీద ప్రత్యేక ప్రోగ్రాములు రూపొందించారు. ఈ హడావిడి అంతా చూసి సామాన్యుడు ఇవి బతుకమ్మ ఉత్సవాలా.. కవితమ్మ ఉత్సవాలా అని సందేహపడిపోయాడు.


ఇప్పుడు లేటెస్టుగా మరో పాయింట్ వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రతిష్టిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాలు కవితమ్మ పోలికలతో వుంటున్నాయట. విగ్రహాలను తయారు చేస్తున్న శిల్పులు మెహర్బానీ కోసం మోడల్‌గా కవితమ్మనే ఎంచుకున్నారో, లేక టీఆర్ఎస్ నాయకత్వం నుంచి అలాంటి ఆదేశాలు ఏవైనా అందాయో గానీ తెలంగాణ తల్లి విగ్రహాల్లో కవితమ్మ పోలికలు ఉట్టిపడుతున్నాయట. అది చూసి జనం నోళ్ళు నొక్కుకుంటున్నారట.



తెలంగాణ తల్లి విగ్రహాల్లో కవితమ్మ పోలికలు కనిపిస్తూ ఉండటాన్ని ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందకృష్ణ మాదిగ వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల్లో కవితమ్మ పోలికలు ఉండటంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లేనిపోని ఆడంబరాలతో రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిరాడంబరంగా ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లిలో కనిపించాల్సిన పోలికలు కవితమ్మవి కావని.. చాకలి ఐలమ్మవని ఆయన అంటున్నారు.