కొడాలి నానికి బైపాస్ సర్జరీ

ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది.  ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలలో ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది. ఆయన హార్ట్ లో మూడు వాల్వ్ లు పూర్తిగా మూసుకుపోయాయని తేలడంతో  తొలుత స్టంట్ లు వేయాలని వైద్యులు భావించారు. అయితే మూడు వాల్వులు పూర్తిగా మూసుకుపోయి ఉండటంతో పాటు కిడ్నీ సమస్య కూడా ఉండటంతో నాని కుటుంబ సభ్యులు ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ కార్డియాక్ సెంటర్ తకు తరలించాలని నిర్ణయించుకున్నారు.   దీంతో నాని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ చేసి అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు బుధవారం (ఏప్రిల్ 2) బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించింది. 
కొడాలి నానికి బైపాస్ సర్జరీ Publish Date: Apr 2, 2025 2:06PM

 రామాపురం అలల్లో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు... కొనఊపిరితో ఒకరు మృతి 

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం( 02 ఏప్రిల్) విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. పర్చూర్ నెహ్రూ కాలనీకి చెందిన చుక్కా వంశీ, రాజేశ్ అనే యువకులు సరదాగా బీచ్ లో గడుపుతున్నారు. ఉదయం నుంచి సముద్రంలో అలలు విపరీతంగా వస్తున్నాయి. మెరైన్ పోలీసులు సందర్శకులను అలర్ట్ చేసినప్పటికీ ఈ ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగారు. సముద్రం నుంచి భారీ తెప్ప ఒకటి తీరం వైపు దూసుకొచ్చింది. తెప్ప తిరిగి సముద్రంలో వెళ్లే క్రమంలో ఇద్దరు యువకులను తీసుకెళ్లింది. ఎంతో చాకచక్యంగా మెరైన్ పోలీసులు వారిని తీరంకు తీసుకొచ్చారు. ఇందులో వంశీ (27) నీళ్లను మింగడం వల్ల పరిస్థితి విషమించడంతో చీరాల ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వంశీ తుది శ్వాస విడిచాడు. పంచభూతాలలో ఒకటైన నీటిని తక్కువ అంచనా వేస్తే  పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదహరణగా మిగిలింది.  
  రామాపురం అలల్లో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు... కొనఊపిరితో ఒకరు మృతి  Publish Date: Apr 2, 2025 1:59PM

జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా.. పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు  చేపట్టిన నిరసనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీసీలకు రజర్వేషన్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి.   తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహనుమంతరావు, మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్, సినీ నటుడు సుమన్‌ తదితరులు జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ సంఘాల నిరసనలో పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించి పార్లమెంటుకు పంపిందనీ, దానిని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళనక దిగారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.  
జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా.. పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్  Publish Date: Apr 2, 2025 1:50PM

వైసీపీలో జగన్ ఒంటరేనా?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కొంద‌రు వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నామ‌న్న భ్ర‌మ‌ణ‌ల్లోనే ఉన్నారు. ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులుమీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రోవైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలా మంది వైసీపీ నేత‌లు మ‌న‌వంతు ఎప్పుడొస్తుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ మెప్పు కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరెత్తేందుకే భయపడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో కేసుల గురించి భయపడవద్దంటూ జగన్ పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పడానికి చేసిన ప్రయత్నం ఏమంత ప్రభావం చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు.  రోజులు గడుస్తున్న కొద్దీ  వైసీపీ నేతలలోనూ, క్యాడర్ లోనూ నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైసీపీ నేతలు మరింతగా భయాందోళనలకు గురౌతున్నారు. ఆ పార్టీలో  నోరున్న నేతలుగా పేరున్న వారంతా దాదాపుగా అజ్ణాత వాసం గడుపుతున్నారని చెప్పవచ్చు. కొడాలి నాని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలు కాగా, పెద్దిరెడ్డి బాత్ రూంలో జారిపడి చేయి విరగ్గొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి అరెస్టు భయంతో అండర్  గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఇక ఆర్కేరోజా, అనీల్ కుమార్ యాదవ్, పేర్ని నాని వంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు మౌనముద్ర వహించి.. నోరెత్తడానికే జంకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  వైసీపీలో కీలక నేతలంతా తమను తాము కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో జగన్ ఒంటరిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
వైసీపీలో జగన్ ఒంటరేనా? Publish Date: Apr 2, 2025 1:10PM

శాంతి చర్చలకు సిద్ధం.. కేంద్రానికి నక్సల్స్ లేఖ

వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ తింటున్న నక్సల్స్ ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి పేరిట కేంద్రానికి ఓ బహిరంగ లేఖ రాశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన  ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని ఆలేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఒక వైపు కేంద్రం నక్సల్స్ ముక్త భారత్ అంటూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ శాంత్రి ప్రతిపాదన చేయడం గమనార్హం. వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మరణిస్తున్న నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదన చేయడం ద్వారా మావోయిస్టులు వ్యూహాత్మకంగా శక్తియుక్తులు కూడగట్టుకోవాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 
శాంతి చర్చలకు సిద్ధం.. కేంద్రానికి నక్సల్స్ లేఖ Publish Date: Apr 2, 2025 12:48PM

 రేవంత్ రెడ్డికి రేణుదేశాయ్ వేడుకోలు 

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా  స్పందించారు. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  ఓ రిక్వెస్ట్ పెడుతూ వీడియో షేర్ చేశారు. తనకు 44 ఏళ్లు  అని, రేపో మాపో చనిపోతానని  ఈ 400 ఎకరాల్లో చెట్లను నరికి వేస్తే వచ్చే తరాలకు  ఆక్సిజన్  దక్కదని పేర్కొన్నారు. ఆ భూమిని అలాగే వదిలేయాలని రేణుదేశాయ్ వేడుకున్నారు. ఆక్సిజన్ , నీళ్ల కోసం ఈ భూమి అవసరమని, అభివృద్ది కోసం అయితే మరో చోట వేలాది ఎకరాలు ఉన్నాయని రేణుదేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఉన్న ఈ భూమిని అన్యాక్రాంతం చేయకూడదని ఆమె కోరారు.   రేణుదేశాయ్ మాటల్లో.. ‘‘నాకు రెండ్రోజుల క్రితమే సెంట్రల్ యూనివర్శిటీ భూముల గూర్చి తెలిసింది. కొన్ని విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నాను. నాకు 44 ఏళ్లు వచ్చేశాయి. రేపో మాపో చనిపోతాను.  కానీ నా పిల్లలతో బాటు మనందరి పిల్లల భవిష్యత్ కోసం  ఆక్సిజన్ అవసరమని , మాకు  ఐటి పార్క్ , భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు  కావాలి. అయితే  అభివృద్ది 100 శాతం ముఖ్యం. అందులో అనుమానమే లేదు. కాని  ఒక్క శాతం  అవకాశం ఉన్నా ఆ భూమిని వదిలేయండి’’ అని రేణుదేశాయ్ చేసిన వేడకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
  రేవంత్ రెడ్డికి రేణుదేశాయ్ వేడుకోలు  Publish Date: Apr 2, 2025 12:37PM