కాందీశీకులు కారు వాళ్లు... కాశ్మీరీ పండిట్లు...

 

ఈ మధ్య సిరియా శరణార్థుల గురించి మీరు చాలానే విని వుంటారు! మీరు ఇంకా శ్రద్ధగా అంతర్జాతీయ వార్తలు వినేవారైతే సిరియా శరణార్థులకి సంబంధించిన ఒక పసి బడ్డ భూమిలో కూరుకుపోయిన దయనీయ దృశ్యం కూడా చూసే వుంటారు! అంతే కాదు, మన భారతీయ మీడియా గాజా మృతుల గురించి, ఆఫ్రికా అంతర్యుద్ధాలకి బలైపోయిన వారి గురించి, వివిధ ఉగ్రవాద సంస్థల దాష్టీకానికి చనిపోయిన వారి గురించీ వీలైనంత చూపిస్తుంది. చెబుతుంది. కాని, జనవరి 19న 1990వ సంవత్సరంలో మన దేశంలోనే మన దేశం వారే శరణార్థులుగా మారారు! అప్పట్నుంచీ వారు మన దేశంలోనే చలికి వణుకుతూ, ఎండకి మాడుతూ, వర్షానికి తడుస్తూ టెంట్లలో వుంటున్నారు! వాళ్లే కాశ్మీరీ పండిట్లు...

 

కాశ్మీరీ పండిట్లు అనగానే చాలా మందికి అయ్యో పాపం అనిపిస్తుంది. కాని, నిజంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీడియాలోనూ చెప్పేవారు తక్కువ. మైనార్టీల కోసం, దళితుల కోసం తాపత్రయపడ్డంతగా ఈ కాశ్మీరీ పండిట్ల కోసం మన మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు అల్లాడినట్టు కనిపించదు. ఇక కొందరు ఇంగ్లీష్ ఉదారవాద జర్నలిస్టులైతే కాశ్మీరి పండిట్లు 1990ల కన్నా ముందు స్థానిక ముస్లిమ్ లతో సరిగ్గా కలవలేదని అంటుంటారు. బాగా డబ్బు, ఆస్తులు సంపాదించుకుని వివక్ష కొనసాగించే వారంటారు. అందుకే, వారిపై ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే ఎవ్వరూ రక్షణకు రాలేదని చెప్పుకొస్తారు. ఇది దారుణమైన కోణం. కాశ్మీరి పండిట్లు వివక్ష చూపినా , చూపికపోయినా వార్ని మాతృభూమి నుంచి బలవంతంగా వెళ్లగొట్టడం అమానుషం. దాన్ని గత పాతికేళ్లలో గట్టిగా వ్యతిరేకించిన వారెవ్వరూ లేరు. 2002  గోద్రా అల్లర్ల విషయంలో చూపినంత బాధా, ఆక్రోశం 1990నాటి కాశ్మీరీ పండిట్ల కోసం కానరాదు. అదే వారి దయనీయ స్థితి సామాన్య భారతీయులకి తెలియకుండా వుండిపోవటానికి కారణం...

 

కాశ్మీర్ లోయలో పండిట్లు మైనార్టీలు. అక్కడ మెజార్టీ వర్గం ముస్లిమ్ లు. వాళ్లలో కొందరి నిశ్శబ్ధ మద్దతుతో పాకిస్తాన్ ప్రేరేపిత హింసాత్మక ఉగ్రవాద మూకలు 1980లలో చొరబడ్డాయి. అవ్వి బరితెగించి, అప్పటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనం వల్ల 90వ సంవత్సరంలో అరాచకానికి తెర తీశాయి. ఉగ్రవాదులు మసీదు మైకుల్లోంచి కాశ్మీరీ పండిట్లను ఇళ్లు వదిలి వెళ్లిపొమ్మని హుకం జారీ చేశారు. వెళ్లిపోయి జమ్మూ, ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన వారు స్వంత దేశంలో ఇప్పటికీ శరణార్థులుగా వున్నారు. మిగతా వారు కాశ్మీరు లోయలోనే హత్యలకి, మానభంగాలకి బలయ్యారు. ప్రభుత్వాలు అధికారికంగా 200మంది మాత్రమే చనిపోయారని చెబుతున్నా వేల మంది అసువులు బాసారు. అయినా ఒక్కడంటే ఒక్కడికీ ఇప్పటి వరకూ శిక్ష పడలేదు! కాశ్మీరీ పండిట్లు మాత్రం కాశ్మీర్ లోయలో హిందువులుగా, మైనార్టీలుగా పుట్టినందుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు!

 

కాంగ్రెస్, ఇతర లౌకిక వాద పార్టీలు కాశ్మీరీ పండిట్ల కోసం మాట్లాడకపోవటం సహజమే! వారి ముస్లిమ్ ఓటు బ్యాంకు కోసం వారు  మౌనమే మార్గంగా ఎంచుకున్నారు. ఇక మాట్లాడే బీజేపి, శివసేన లాంటి పార్టీలు కూడా ఇప్పటి వరకూ కాశ్మీరీ పండిట్లకు మేలు చేసిన దాఖలాలు ఏమీ లేవు. వాజ్ పేయి హయాంలో, ఇప్పుడు మోదీ పాలనలో ఎప్పుడూ పండిట్లకు ఒదిగిందేం లేదు. ఇందుకు కారణం పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యమనే చెప్పలేం. కాశ్మీర్ లోని ముస్లిమ్ నేతల సారథ్యంలో నడుస్తోన్న ప్రాంతీయ పార్టీలు కూడా పండిట్ల దుర్భర జీవితాలకి కారణం. పైకి వార్ని తిరిగి కాశ్మీర్ కి రమ్మని చెబుతున్నా వాళ్ల ప్రాణ, మాన, ఆస్తులకి ఎలాంటి భరోసా ఇవ్వకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుంటాయి. ఈ విషయంలో ఎన్సీ, పీడీపీ అన్న భేదాలేం లేవు. పండిట్లకు అందరూ మూకుమ్ముడిగా వ్యతిరేకమే. దశాబ్దాలు గడిచిపోతున్నాసమస్య పరిష్కారం కాకపోవటానికి ఇదే ప్రధాన కారణం.

 

కాశ్మీరీ పండిట్లు అగ్రవర్ణం అని కొన్ని పార్టీలు మాట్లాడకపోవచ్చు. వారు హిందువులు కాబట్టి కొన్ని లౌకికవాద పార్టీలు మాట్లాడకపోవచ్చు. కాని, వారి దుస్థితి కేవలం వారికే ప్రమాదకరం కాదు. వాళ్లను వెళ్లగొట్టి తిరిగి రానీయకుండా వుంచగలుగుతున్న ఉగ్రవాదులు, వారి కాశ్మీరి మద్దతుదారులు ఏనాటికైనా యావత్ కాశ్మీర్ నే కబళించగలరు. అందుకోసమైనా భారత ప్రభుత్వం కాశ్మీరీ పండిట్లను వారి మాతృ భూమిలో తిరిగి స్థిరపరచాలి. అప్పుడే కాశ్మీర్ పై మన పట్టు సడలకుండా వుంటుంది. లేకపోతే ఇవాళ్ల కాశ్మీర్ కాశ్మీరీ పండిట్లకు కాకుండా పోయినట్టే మొత్తం దేశానికీ కాకుండా పోతుంది. పాకిస్తాన్ చేతుల్లో చిక్కుకుపోతుంది...