కాశ్మీర్ టూ కేరళ… క్యాన్సర్ విస్తరిస్తోంది! కాలం మించిపోతోంది!

 

ఉగ్రవాదం… ఇప్పుడు మనొక్కరి సమస్య కాదు. యావత్ ప్రపంచం సతమతం అవుతోంది. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ధనిక, పేద దేశాలు, ఖండాలు అన్నీ వణికిపోతున్నాయి. అయితే, ఇండియాకి టెర్రరిజమ్ కొత్త కాదు. దశాబ్దాలుగా మనం నెత్తురోడుతూనే వున్నాం. కాని, రాను రాను ఉగ్ర ముప్పు అన్ని దిక్కుల్లోంచి ముసురుకుంటోంది. ఉగ్రవాదం ప్రత్యక్ష యుద్ధం కాదు కాబట్టి… మనం నిజానికి ఇప్పుడు పరోక్ష యుద్ధంలోనే వున్నామని అర్థం. ప్రతీ రోజూ, ప్రతీ నిమిషం శత్రువు మనకు ఒక్కో అడుగు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆధునిక టెక్నాలజీని టెర్రరిజమ్ వాడుకోవటం… మరింత ఆందోళనకారం!

 

గడిచిన కొన్ని గంటల్లో రెండు ఆందోళనకర వార్తలు వచ్చాయి మీడియాలో. వాట్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతగా ఉగ్రవాదం మనకు నిత్యకృత్యం అయిపోయింది. ఇక మొదటి వార్త ఏంటంటే… కాశ్మీర్లో ఓ లష్కరే ఉగ్రవాది ఎన్ కౌంటర్లో మరణించాడు. అతడి అంత్యక్రియల్లో ఇతర ఉగ్రవాదులు జనం మధ్యలో చొరబడ్డారు. గాల్లోకి కాల్పులు జరిపి సాల్యూట్ చేసి వెళ్లారు! అలా గన్ సాల్యూట్ ఎవరికి చేస్తారు? దేశం కోసం మరణించిన అమరులకి, ఉన్నత స్థానాలు అలంకరించిన నేతలకి చేస్తారు! కాని, మన దేశంలో ఉగ్రవాదులు నిర్భయంగా కెమెరాల ముందే గాల్లోకి కాల్పులు జరిపి తమ గౌరవం, భక్తి చాటుకున్నారు! కాశ్మీర్లో ఇలాంటి దుర్మార్గ స్థితి మనం ఊహించలేనిదేం కాదు. అక్కడ ఉగ్రవాదులు రాళ్లు మొదలు బుల్లెట్ల దాకా అన్నీ వాడుకుంటున్నారు. ఆవేశంలో వున్న కాశ్మీరీ యువతను కూడా తమ స్వార్థానికి వాడేసుకుంటున్నారు…

 

కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు, కలకలం ఎంత మాత్రం  విశేషం కాదు. నిజానికి కాశ్మీర్ లోయలో ఏదైనా ఒక రోజు కాల్పుల చప్పుళ్లు వినిపించకపోతే అదీ అసలు విశేషం! కాని, ఇప్పుడు మనం నిజంగా వణికిపోవాల్సింది ఎక్కడో దక్షిణాన వున్న కేరళలో కూడా ఉగ్ర కదలికలు బయటపడుతుండటమే! తాజాగా ఎన్ఐఏ బయటపెట్టిన సమాచారం ప్రకారం… కేరళలోని కొందరు ఒక వాట్సప్ గ్రూప్ ద్వారా అఫ్గనిస్థాన్ లోని టెర్రరిస్టులతో టచ్ లో వున్నారట! వాళ్లు ఇక్కడ నుంచే వెళ్లిన కేరళ భారతీయులు. ఐఎస్ఐఎస్ లో చేరారు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వారితో వాట్సప్ సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇక్కడి దేశ ద్రోహులు! ఇప్పటికే ఎంతో మంది ఐఎస్ఐఎస్ లో చేరి కూడా వుండొచ్చని జాతీయ భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు!

 

కాశ్మీర్ , కేరళ మాత్రమే కాదు… ఉగ్రవాదం ఇప్పుడు భారతదేశంలో నలుమూలలా విస్తరిస్తోంది. బీజేపి అధికారంలో వున్న రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ప్రాంతీయ పార్టీల ఏలుబడి సాగుతోన్న రాష్ట్రాల్లో అంతటా ఒకటే పరిస్థితి. పాక్ లోని, ఇతర ఇస్లామిక్ దేశాల్లోని ఉగ్రవాదులు ఇక్కడి మైనార్టీల మనసులు మారుస్తున్నారు. మన వార్నే మనకు శత్రువులుగా తయారు చేస్తున్నారు. అందుకోసం ఫేస్బుక్, వాట్సప్ లాంటి టెక్నాలజీ వాడుకుంటున్నారు. కాశ్మీర్ అల్లర్లకు వాట్సప్ గ్రూపులే కారణమంటోంది ఎన్ఐఏ. అలాగే, పట్టించుకునేవాడు లేకుండా ప్రసారమైపోయే ఎన్నో ఛానల్స్ కూడా దేశం పై పగని బోధిస్తున్నాయని తేలుతోంది! దీని వల్ల ఒకే దేశంలోని రెండు వర్గాలు ఒకర్ని ఒకరు అనుమానాస్పదంగా చూసుకోవాల్సిన దుస్థితి వస్తోంది!

 

కాశ్మీర్లో తాజాగా ఎన్ కౌంటరైన లష్కర్ ఉగ్రవాది ముస్లిమ్. అతడికి మద్దతుగా అంత్యక్రియల్లో పాల్గొన్నది కూడా ముస్లిమ్ లే. గన్నులతో కాల్పులు జరిపి కలకలం రేపిన వారు కూడా ముస్లిమ్ లే. అయితే, ఇక్కడే మరో కోణమూ వుంది. లష్కర్ ఉగ్రవాదిని ఎన్ కౌంటర్ చేయటంలో సాహసోపేతంగా పాలుపంచుకుని ప్రాణాలు కోల్పోయింది కూడా ముస్లిమ్ పోలీసే! మెహమూద్ అనే యువకుడు ఎన్ కౌంటర్లో అమరుడయ్యాడు! కాని, ఎవరో కొందరు ఆవేశపరులైన మైనార్టీ యువకులు చేస్తోన్న ఉగ్ర కార్యకలాపాల వల్ల వారి సమాజం మొత్తానికి అనుమానాస్పద చూపులు తప్పటం లేదు. ఇదే స్థితి ప్రపంచ ముస్లిమ్ లందర్నీ వేధిస్తోంది. ఇండియాలో చాలా వరకూ హిందూ, ముస్లిమ్ సంబంధాలు ఎంతో పటిష్టమనే చెప్పాలి.

 

దేశం మొత్తం క్యాన్సర్ లా విస్తరిస్తోన్న ఉగ్రవాదాన్ని ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం అరికట్టాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాజకీయ శత్రుత్వాలు, లాభాలు పక్కన పెట్టి కేంద్రానికి తగిన సహకారం అందించాలి. మనలో మనకి ఎన్ని విభేదాలున్నా ఎవ్వరూ విభేదించకుండా వుండలేని ఉగ్రవాదం. తప్పకుండా ఉగ్రపోరులో దేశమంతా ఒక్కటి కావాలి. ఎందుకంటే, దేశం లోపలి ఉగ్రవాదం పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైంది. అది వేటు వేయదు… వేయి గాట్లతో రక్తమోడేలా చేస్తుంది!