కలైంగర్‌గా ఎదిగిన కరుణానిధి సక్సెస్ సీక్రెట్ ఇదే!

రంగం ఏదైనా, విజయం సాధించింది ఎవరైనా… గెలవాలంటే ఏవో కొన్ని ప్రత్యేకతలు తప్పకుండా అవసరం! అలాంటిది కొన్ని కోట్ల మంది తలరాతలు మార్చే సీఎం పదవి ఆషామాషీగా వచ్చేయదు. వచ్చినా నిలవదు. అందుకే, సినిమా, క్రికెట్, వ్యాపారం కంటే వేయింతలు ఎక్కువ పోటీ, ఎక్కువ ఒత్తిడి వుండే రంగం రాజకీయ రంగం. అందులోనూ రాష్ట్ర రాజకీయాలకు తలమానికమైన ముఖ్యమంత్రి పదవి అంటే అది మరింత కష్టతరం! మరి అటువంటి ముఖ్యమంత్రి కుర్చీని కరుణానిధి ఎన్నిసార్లు అలంకరించారు? అచ్చంగా అయిదుసార్లు! అంటే… స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ సాగిన ప్రజాస్వామ్య తమిళ చరిత్రలో…. దాదాపు ఇరవై ఏళ్లు ఆయన పాలనే అన్నమాట! అంతటి సక్సెస్ కరుణకు ఎలా దక్కింది?

 

 

కరుణానిధి వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. అలాగని పుట్టుకతోనే మహాశ్రీమంతుడు కూడా కాదు. ఆయనది వెనుకబడిన వర్గానికి చెందిన నాయి బ్రాహ్మణ కులం. కానీ, దక్షిణా మూర్తిగా పుట్టి కరుణానిధిగా ఎదిగారు. స్వయంకృషితో తమిళ సినిమా రంగంపై ముద్ర వేశారు. అదే పెట్టుబడిగా డీఎంకేలోకి వచ్చి … తానే డీఎంకేగా మారిపోయి… తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. వీటన్నిటి వెనుక ఆయనకు వంశ వారసత్వం, కోట్లాది రూపాయల డబ్బు, అగ్ర కులం వల్ల వచ్చే సామాజిక పరపతి… ఇవేవీ లేకున్నా… ఎన్ని ఒడిదుడుకుల్ని అయినా మనో నిబ్బరంతో ఎదుర్కొనే వ్యక్తిత్వం వుంది! అదే మామూలు కరుణానిధిని… కలైంగర్ ని చేసింది!

 

 

కరుణానిధి ఎలాంటి వాడు? ఈ విషయం తెలియాలంటే ఈ ఒక్క విషయం చాలు! కరుణ 1944లో ఒక యువతిని ప్రేమించారట. ఆమె కుటుంబం వారు కూడా వీరి పెళ్లికి అంగీకరించారట. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం తాళిబొట్టు కట్టాలని కోరారట. కరుణానిధి అందరికీ తెలిసినట్టుగానే పరమ నాస్తికుడు! మరి ఎలా ఒప్పుకుంటారు? అందుకే, తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమను, ప్రియురాలిని వద్దనుకున్నారు. కరుణానిధిని ప్రేమించిన సదరు యువతి కూడా జీవితాంతం అవివాహితగానే వుండిపోయింది! ఆ ఇద్దరి ప్రేమ నిజంగా గొప్పదే. అంతే కాదు, హిందూ సంప్రదాయాల కోసం ఆమె అంకిత భావం, తన నాస్తిక విశ్వాసం కోసం కరుణ పట్టుదల రెండూ మెచ్చుకోదగ్గవే!

 

 

కరుణానిధి తన ప్రేమను వదులుకోవటం, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగటం రెండూ వేరు వేరు కావచ్చు. కానీ, వాటి మధ్య లోతైన సంబంధం కూడా వుంది. తాను నమ్మిన దాని కోసం ఎంతదాకా అయినా వెళ్లటం కరుణ సక్సెస్ సీక్రెట్. ఆయన ఎన్ని దశాబ్దాలు తమిళనాడును ఏలారో అంతకంటే ఎక్కువ కాలం ప్రతిపక్షంలో వున్నారు. అయినా అధికారంలో వున్నా లేకున్నా… ఏ ఒక్క క్షణం కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి దూరంగా జరగకపోవటం అందరూ నేర్చుకోవాల్సిన విషయం! ఆయనంటే నచ్చే వారు ఆయన మొండితనాన్ని పట్టుదల అంటారు! ఆయనంటే పడని వారు ఆయన పట్టుదలని మొండితనం అంటారు!