జగన్ పై పారిశ్రామికవేత్త సంచలన కామెంట్స్.. అందుకే టార్గెట్ చేశారా?

 

ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తేనే, ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి జరుగుతుంది. అయితే, పెట్టుబడులు రావడం అంత ఈజీ కానేకాదు. ఎందుకంటే, ఆయా ప్రభుత్వాలపై ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగితేనే, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టుల రద్దు, పీపీఏల సమీక్షలాంటి నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లుతోంది. పైగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేవైనా, వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకులాంటి మేజర్ ఇన్వెస్టర్స్ తప్పుకోవడంతో...ఇప్పటికే వందల వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయి.

కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి.... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని, ఇలాగైతే రాష్ట్రం నాశనం కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ తీరుతో ఏపీకి కొత్త పరిశ్రమలు రావని, ఆయన వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు దేవాలయాల భూములను జగన్ అనుచరులు కొట్టేస్తున్నారని, దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశంలోనే పేరెన్నికగల పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వంపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, టీడీపీ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లకు ఫుడ్ సప్లై చేసిన అక్షయపాత్ర సంస్థకు దాదాపు 45కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందట. ఈ బిల్లులు చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం నో చెప్పినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, విచారణ తర్వాతే చెల్లింపులు ఉంటాయని తేల్చిచెప్పిందట. ఇదే, టీవీ మోహన్‌దాస్‌ పాయికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అక్షయపాత్ర బోర్డులో సభ్యుడిగా ఉన్న మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటం, విచారణలు చేయడం వరకు ఓకే కానీ...చేసిన పనికి బిల్లులు చెల్లించమని, చెప్పడం ప్రభుత్వ ఉగ్రవాదం కిందకే వస్తుందని పాయ్ అంటున్నారు.

ఏదేమైనా జగన్ ప్రభుత్వంపై ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ స్థాయిలో ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటిసారి జగన్ టార్గెట్ గా పాయి ఘాటు విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.