కర్ణాటక ఎన్నికల్లో హంగ్...జేడీఎస్ కీలకం.. ఆపార్టీకే మద్దతు..

 

ఎట్టకేలకు కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి చూపు ఎన్నికల ఫలితాల మీద పడింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఎన్నో సంస్దలు సర్వేలు కూడా చేశాయి. అయితే ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతుండటంతో అసలు ఏ పార్టీ గెలుస్తుందా అని అందరూ ఆసక్తికరంగా మారింది. ఒకానొక సందర్భంలో హంగ్ కూడా ఏర్పడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ హంగ్ కనుక ఏర్పడితే పరిస్థితి ఏంటన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా వరకు బీజేపీ సుమారు 97 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని...  బీజేపీ తర్వాతి స్థానంలో 90 సీట్లతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 112 సీట్లు అవసరం.. దీంతో జేడీఎస్ కీలకంగా మారింది.  జేడీఎస్‌కు 31 సీట్లు రావచ్చని అంచనా. ఆ పార్టీ మద్దతు ఇచ్చే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి జేడీఎస్ మద్దతు బీజేపీకేనని అందరూ భావించారు. కానీ.. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని, అది తమ బాధ్యత అని జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, జేడీఎస్‌ను బీజేపీ-బి టీమ్‌గా అభివర్ణించారు. రాహుల్ ఆరోపణలను దేవెగౌడ కొట్టివేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత జేడీఎస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి అయిన డానిష్ అలీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌కు ఒకవేళ మెజారిటీ రాకుంటే, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే… అప్పుడు మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా’’ అని పేర్కొన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...హంగ్ ఏర్పడుతుందో.. లేదో..!