పవన్ కు పోటీగా చిరంజీవి..!

 

కర్ణాటక ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ... బీజేపీకి ఈ ఎన్నికలు ఇంకా కీలకంగా మారాయి. కారణం.. దీనికి బీజేపీ పై దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతే. ఇప్పటికే వచ్చిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుండటంతో.. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తమ సత్తా చూపించాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా తమ వ్యూహాలు తాము రచించుకుంటున్నారు.

 

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఎన్నికల్లో తెలుగు వాళ్ల ప్రచారానికి బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రధానంగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో, బెంగళూరు సిటీలో తెలుగు స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం కోసం కన్నడ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించుకోవడానికి జేడీఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చిరంజీవితో ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ ప్రచారానికి వస్తారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారని... కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి ఆయన వస్తారని అక్కడి కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

 

అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి పదవికాలం ఇటీవలే ముగిసింది. చిరును మళ్లీ రాజ్యసభకు పంపడానికి తగిన బలం కాంగ్రెస్ కు లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మరీ ఏపీలో ఉన్నంత వీక్ గా లేదు. చిరంజీవి వచ్చి ప్రచారం చేస్తే సినీ గ్లామర్ కలిసి వస్తుందని అక్కడి నేతలు భావిస్తున్నారు. అధిష్టానం చేత చెప్పించి, చిరంజీవిని ప్రచారానికి రప్పించేయత్నాల్లో ఉన్నారట అక్కడి కాంగ్రెస్ నేతలు. మరి చిరంజీవి వెళతారో లేదో చూడాలి. ఒకవేళ చిరంజీవి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ ను చిరంజీవి కి మధ్య పోటీ ఏర్పడుతుందేమో.