కర్ణాటకలో సెమీ ఫైనల్ ఆడనున్న రాహుల్ గాంధీ

 

మే 5న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికలకి సెమీ ఫైనల్స్ వంటివని చెప్పవచ్చును. దక్షిణాదిన ఏకైక బీజేపీ పాలిత రాష్ట్రమయిన కర్ణాటకలో రాహుల్ గాంధీ తన పార్టీని గెలిపించుకొనగలిగితే అది ఆయన సామర్ధ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతే కాకుండా అది వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి, ఆయనకు అవసరమయిన మనోబలం కూడా కలిగిస్తుంది. ఎన్నికల షెడ్యుల్ వెలువడక ముందే ఒకసారి ఆ రాష్ట్ర పర్యటన చేసి అక్కడి పరిస్థితులను ఆరా తీసివచ్చిన ఆయన, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశాలు మొదలుపెట్టేసారు.

 

ఒకనాడు తిరుగులేని విధంగా ఆ రాష్ట్రాన్ని ఏలిన బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో అత్యంత దయనీయమయిన పరిస్థితులలో చిక్కుకొని, కాంగ్రెస్ కొత్త రధసారధి రాహుల్ గాంధీకి అన్ని విధాల అనుకూలమయిన వాతావరణం కల్పించి ఆహ్వానిస్తోంది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న ఇంత చక్కటి అవకాశం బహుశః మరెప్పుడూ, మరెక్కాడా కూడా ఆయనకి దొరకకపోవచ్చును.

 

కానీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల పద్దతులు, ఆలోచన తీరు, కులాల లెక్కల గురించి అవగాహన ఉన్న రాహుల్ గాంధీకి దక్షిణాది రాష్ట్రాల మీద అంత పట్టులేదనే చెప్పవచ్చును. అయితే, అతిరధ మహారధులు తోడున్నఆయనకి ఇదేమంత పెద్ద సమస్య కాదు. కానీ, గత రెండు దశబ్దాలుగా ఆ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన కాంగ్రెస్ పార్టీని ఇంత తక్కువ సమయంలో చక్కదిద్ది, వారిలోంచి గెలుపు గుర్రాలను ఎంచుకోవడమే ఆయన ముందున్న అతి క్లిష్టమయిన సమస్య అని చెప్పవచ్చును.

 

కర్ణాటక రాష్ట్రంలో తన కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దడమే కాకుండా రాహుల్ గాంధీకి మరో సవాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును. అది తన రాజకీయ జీవితాన్ని సవాలు చేయనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నుంచి కావచ్చును. దక్షిణాదిన తనకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కేవలం నాయకత్వ సమస్య కారణంగా బీజేపీ అంత తేలికగా వదులుకొంటుందని భావించలేము. గనుక, రాబోయే సాధారణ ఎన్నికలను నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న బీజేపీ, ఆయనను ఇప్పుడే ముందుంచుకొని కర్ణాటక ఎన్నికలలో రాహుల్ గాంధీని డ్డీ కొనవచ్చును. ఒకవేళ, బీజేపీ నరేంద్ర మోడీకి గనుక కర్ణాటక బాద్యతలు అప్పగించినట్లయితే, ఆయనను డ్డీ కొనడం రాహుల్ గాంధీకి తలకు మించిన పనే అవుతుంది.

 

కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రాహుల్ గాంధీకి వరమయితే, మంచి రాజకీయ అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు అనే మంచి పేరు నరేంద్ర మోడీకి సానుకూలాంశంగా ఉంటుంది. ఒకవేళ బీజేపీ తన అంతర్గత సమస్యల వలన నరేంద్ర మోడీకి కాకుండా మరెవరికి కర్ణాటక బాధ్యతలు అప్పగించినా అది రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ఆ రాష్ట్రంలో మార్గం సుగమం చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన పురపాలక సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ , అధికార బీజేపీపై పూర్తి పై చేయి సాదించడమే బీజేపీ పట్ల ప్రజల వ్యతిరేఖతకు అద్దం పడుతోంది. అందువలన నరేంద్ర మోడీ తప్ప ఇతరులెవరు బీజేపీకి సారద్యం వహించినా కూడా, కర్ణాటక రాష్ట్రాన్ని పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అందించినట్లే అవుతుంది.

 

ఇదివరకు నితిన్ గడ్కారికి పార్టీ అధ్యక్షా పదవికి ఆఖరి నిమిషంలో గండికొట్టినట్లు, మళ్ళీ మోడీకి కూడా అడ్డుపడేందుకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఏమయినా పధకాలు ఉంటే, కర్ణాటకలో రాహుల్ గాంధీ ప్రయాణం సజావుగా సాగిపోతుంది. లేదంటే మాత్రం ఆయనకు మోడీతో అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు.