చూడప్పా సిద్ధప్పా.. 'నేనే రాజు నేనే మంత్రి' అంటున్న యడ్యూరప్ప

 

'చూడప్పా సిద్ధప్పా.. నేను సింహం లాంటోడిని.. సింగిల్ గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా' అన్నట్టుంది ప్రస్తుతం కర్ణాటక సీఎం యడ్యూరప్ప పరిస్థితి. కాంగ్రెస్- జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టి 'రాజు' అయితే అయ్యారు కానీ పాపం తోడుగా 'మంత్రులే' లేరు. దీంతో సోలోగానే మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారట.

మూడు వారాల క్రితం కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు కానీ ఇప్పటి వరకు మంత్రివర్గం ఏర్పాటే చెయ్యలేదు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిద శాఖలకు చెందిన అధికారులతో యడ్యూరప్ప మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు.

నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా.. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి (ముఖ్యమంత్రి) యడ్యూరప్ప. మంత్రివర్గ సమావేశం నిర్వహించినట్లు సంతకాలు చేసే రిజిస్టర్ లో యడ్యూరప్ప ఒక్కరే సంతకం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించడం కోసం సీఎం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులతో పాటు సీనియర్ అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో అధికారికంగా నాలుగు మంత్రివర్గ సమావేశాలు జరిగాయి.

మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుమతి కోసం యడ్యూరప్ప ఇన్నిరోజులు వేచి చూశారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ అనుమతితో యడ్యూరప్ప ఆగస్టు 20వ తేదీ మంగళవారం మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి సిద్దం అయ్యారని తెలుస్తోంది.