షరీఫ్, ముషారఫ్‌లకు ప్రాణబిక్ష పెట్టిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌

సరిగ్గా 17 ఏళ్ల క్రితం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన కార్గిల్ యుద్దం గుర్తుందా..? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ను వశం చేసుకునేందుకు దాయదీ దేశం వేసిన ఎత్తును చిత్తు చేసింది భారత సైన్యం. చలికాలం సరిహద్దుల్లోని సైనిక పోస్టులను ఇరుదేశాల సైనికులు వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999లో అలా జరగలేదు..పాకిస్తానీ సైనికులు తమ పోస్టులను వదల్లేదు సరికదా..భారత పోస్టుల్లో మకాం వేశారు..వీరికి మద్ధతుగా ఉగ్రవాదులు సరిహద్దుల్లోకి చొరబడ్డారు..చివరకు మే నెలలో విషయం భారత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోస్టులను ఖాళీ చేయాలని భారత్ అంతర్జాతీయ సమాజం ద్వారా చెప్పిచూసింది. కానీ పాకిస్తాన్ ససేమిరా అనడంతో భారతదేశం తప్పనిసరి పరిస్థితుల్లో యుద్దరంగంలోకి దిగింది.

 

నెల రోజుల పాటు జరిగిన సమరంలో ఒక్కొ కొండపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి ముష్కర మూకను తరిమి తరిమి కొట్టాం. ఈ యుద్ధంలో 537 మంది భారత సైనికులు అమరులవ్వగా..1363 మంది గాయపడ్డారు. పాక్ వైపున 453 మంది చనిపోగా..665 మంది గాయపడ్డారు. కొండపైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. భారత సైన్యం అసమాన ధైర్యసాహసాలకు గుర్తుగా విజయ్ దివస్ పేరుతో ప్రతీ ఏటా జవాన్ల సేవలను స్మరించుకుంటున్నాం.

 

ఆ సమయంలో సైన్యానికి మద్దతుగా శత్రుమూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి..విజయంలో కీలకపాత్ర పోషించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. అయితే ఒకానొక దాడిలో అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ వాయుసేన దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారట..1999 జూన్ 24న నియంత్రణ రేఖ అవతల ఉన్న గుల్తేరీ ప్రాంతంలో పాక్ ఆర్మీ బేస్ క్యాంపుపై బాంబుల వర్షం కురిపించేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానాలు వెళ్లాయట..ఈ సందర్భంగా పాక్ సైనికులనుద్దేశించి ముషారఫ్, నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తున్నారట. లక్ష్యాన్ని గురి చేసి కొట్టేందుకు పైలట్ సిద్ధమవుతుండగా అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండటం చూసి ఎయిర్ మార్షల్‌కు సమాచారం అందించారట..

 

దీంతో ఆయన విమానాలను దారి మళ్లీంచారట..ఈ విషయాన్ని నాటి ఎయిర్ మార్షల్ ఏకే సింగ్ తెలిపారు. శత్రువునైనా క్షమించగలిగే గొప్ప మనసు మన సైన్యానికి ఉండబట్టే ముషారఫ్, షరీఫ్‌లు ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు..ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్న పైలట్ ఉన్నతాధికారులకు సమాచారం అందించకుండా ఒక్క బటన్ ప్రెస్ చేసి ఉన్నా..ఎయిర్‌మార్షల్ జెట్ ఫైటర్లను దారి మళ్లీంచకపోయినా షరీఫ్, ముషారఫ్‌లు చనిపోయి 18 ఏళ్లు గడిచిపోయేవి.