తె.దే.పాను ‘కాపు’ కాస్తాం...

 

 

 

రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో... వచ్చే ఎన్నికల్లో ఊహించని విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఓ కులం మద్ధతు టోకున లభించనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజికవర్గం తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. తె.దే.పాతో కాపు కులం వైరానికి విజయవాడలో వంగవీటి రంగా హత్య తొలి బీజం వేసింది. అక్కడ నుంచి కాపు కులస్థులు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను కోరుకోవడం, సహజంగానే కమ్మ సామాజికవర్గం డామినేషన్‌ ఉన్న తెదేపాలో తాము ఎదగలేమనే భయంతో... స్వంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం వంటివి ఈ దూరాన్ని మరింత పెంచాయి. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన కాపు కులస్థులు ఆ పార్టీ కూడా తమను ఓటుబ్యాంకుగానే చూస్తోందని గ్రహించి నిరాశలో కూరుకుపోయారు. అదే సమయంలో 2009లో రాజకీయనగారా మోగించిన చిరంజీవిలో వారికి ఆపద్భాంధవుడు కనిపించాడు. అంతే ఆస్థులూ, ఆభరణాలూ సైతం తాకట్టు పెట్టి చిరంజీవికి అన్ని విధాలుగా సహకరించారు. నిజానికి చిరంజీవికి పడిన 70లక్షల ఓట్లలో కాపు కులస్థుల ఓట్లే అత్యధికం అనడంలో సందేహం లేదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి అధికారంలోకి రాకపోయినా వారు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదేమో కాని... నమ్మినవారిని నట్టేట ముంచుతూ ఆయన కాంగ్రెస్‌ బోటెక్కేశారు. దీంతో మరోసారి, అదీ గతంలో ఎన్నడూ లేనంత పెద్దస్థాయిలో మోసపోయినట్టు భావించారు కాపులు.

 

వీటన్నింటి నేపధ్యం, ప్రస్తుత రాజకీయపరిస్థితులు బేరీజు వేసుకుంటున్న కాపు సామాజికవర్గం తెలుగుదేశం పార్టీ  వైపు మొగ్గు చూపుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా తమను మోసం చేయడమే కాకుండా చిరంజీవి అనే ఏకైక నాయకుడ్ని కూడా తమకు కాకుండా చేసిన కాంగ్రెస్‌ తప్పులు రాష్ట్ర విభజనతో పరాకాష్టకు చేరాయని కాపుల భావన అనీ, ఈ నేపధ్యంలో ఎలాగైనా ఆ పార్టీని ఓడిరచాలని  ఆ సామాజికవర్గం  ఆత్రుతగా ఎదురు చూస్తోందంటున్నారు. రాష్ట్రజనాభాలో దాదాపు 35శాతంగా ఉన్న కాపుల ఓట్లు గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది  తెలిసిందే.




కాంగ్రెస్‌, సోనియాలను ఎదిరించినందుకు గాను విభజనకు ముందు కాపులు  వైకాపా వైపు, జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గు చూపినా విభజనానంతరం వారిలో జగన్‌ వైఖరి పట్ల భ్రమలు తొలగిపోయాయి. జగన్‌ కూడా  తర్వాత తర్వాత కాంగ్రెస్‌లో కలవక తప్పదని, ఇదంతా  కాంగ్రెస్‌ ఆడిస్తోన్న నాటకం అని భావిస్తున్న కాపు వర్గం... ఈ కుట్రలను ఛేధించాలని, దీంతో తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగానే విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు వంటి పలువురు కాపు నేతలు తె.దే.పా లోకి దూకేందుకు సిద్ధమవడాన్ని వీరు చూపుతున్నారు.  ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా  మలచుకునేందుకు కాపులకు మరింత దగ్గరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ కూడా  ప్రయత్నాలు ముమ్మరం చేసింది.