స్వంత సామాజిక వర్గంలో సాంతం పోగొట్టుకుంటున్న పవన్!

ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారిన అంశాల్లో కాపు రిజర్వేషన్లు ఒకటి. నిజానికి కాస్తో కూస్తో చంద్రబాబును ఇరుకున పెట్టదలుచుకుంటే మిగిలింది అదొక్కటే! ప్రత్యేక హోదా మీద ఆయన చేయగలిగింది అంతా చేస్తున్నారు. పార్లెమంట్ వేదికగా మోదీ వ్యతిరేక గళం ధైర్యంగా వినిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిలో కీలకంగా మారి వచ్చే ఎన్నికల తరువాతైనా హోదా సాధించే వ్యూహం పన్నుతున్నారు. ఇక పోలవరం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపే పోలవరం నీళ్లు కొంత మంది ఆంద్రా రైతుల పోలాల్ని అయినా తడిపి తీరుతాయి. ఇలాంటి నేపథ్యంలో కాపు రిజర్వేషన్ పై బాబు మాట ఇంకా అమలు కాలేదు. అదే జగన్, పవన్ చక్కగా వాడుకోగల అంశం!

 

 

కాపు రిజర్వేషన్లు బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో వుంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది కాబట్టి దిల్లీ ప్రభుత్వం అంగీకరిస్తే కాపులు బీసీల్లో చేరతారు. కానీ, దాన్ని ఎలాగైన రాజకీయ అంశంగా కొనసాగించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పోనీ అదన్నా సీరియస్ గా చేసి చంద్రబాబును ఇరుకున పెడుతన్నాయా అంటే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ తమకు తామే డ్యామేజ్ చేసుకుంటున్నాయి. జగన్ కాపు రిజర్వేషన్ విషయంలో ఈ మద్యే చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్నారు! నా వల్ల ఏం కాదని చేతులు ఎత్తేసి ఇరవై నాలుగ్గంటల్లో మీడియా వక్రీకరించింది అన్నారు. కేంద్రం పరిధిలో వున్న అంశం నేనేం చేయలేనని ఆయనే లైవ్ లో మాట్లాడారు. వేలాది జనం విన్నారు. అయినా జగన్ తూచ్ .. నేను అలా అనలేదు అని దబాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి కాపు సామాజిక వర్గంలో అనుమానాస్పదుడుగా మిగిలిపోయారు!

 

 

కాపు రిజర్వేషన్ అంశం జగన్ కంటే ఎక్కువగా వాడుకోగలిగేది పవన్! ఆయన ప్లేస్ లో మరో అనుభవం, లోక జ్ఞానం వున్న కాపు నేత వుండి వుంటే నానా రచ్చ చేసి వుండేవాడు. మరీ గుజరాత్ లోని హార్దిక పటేల్ లా రోడ్డు మీద పోరాటాలకు తెగించకున్నా కనీసం రాజకీయ ప్రసంగాలతోనైనా కాపుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు పవన్! అదే సామాజిక వర్గానికి చెందిన స్టార్ హీరో అయిన ఆయన ఏం చెప్పినా కాపు యువత తీవ్రంగా ప్రభావితం అవుతారు. మరి అటువంటప్పుడు పవన్ తాను కాపు రిజర్వేషన్లకు అనుకూలం అని చెబితే ఏం పోయింది? అది సాద్యం కాదు… కేంద్రం పరిధిలో వుంది… కాబట్టి కాపుల్ని మోసం చేయకూడదని జనసేనాని ఆలోచనా? అంత మంచి ఆలోచన వుంటే అదే చెప్పొచ్చు కదా? అలా కూడా చేయకుండా పవన్ ఓ కమిటీ వేశారు! గతంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ , జేఎఫ్సీ లాంటి హంగామాలు చేసిన పవర్ స్టార్ ఇప్పుడు మరోసారి ముచ్చటగా కాపుల డిమాండ్ పై కమిటీ వేశారు! పోయిన ఎన్నికల ముందు నుంచీ కీలకమైన అంశంగా వున్న కాపుల అంశంపై ఇప్పుడు అధ్యయనమా? ఏమైనా కామన్ సెన్స్ వుందా అనేస్తున్నారు జనసేనాని ప్రత్యర్థులు!

 

కాపు రిజర్వేషన్లకు అనుకూలమని, వ్యతిరేకమని ఏదీ చెప్పకుండా పవన్ కమిటీ రాజకీయాలు నడుపుతున్నారు. ఆయన వేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, ఈయన అభిప్రాయం వెలిబుచ్చేది ఎప్పుడు, కాపు ఓటర్లు ఆయనకు మద్దతు పలకాలా వద్దా అని నిర్ణయించుకునేది ఎప్పుడు?

పవన్ కాపు రిర్వేషన్ల అంశాన్ని హ్యాండిల్ చేస్తున్న పద్దతి, తన వర్గం వారిలో బలమైన నేతగా ఎదిగే అవకాశాన్ని చేజార్చుకుంటున్న తీరు చూస్తే … ఆయన అపరిపక్వత తప్ప మరేం కనిపించటం లేదు. ఇదే ప్రస్తుతం రాజకీయ పండితుల అభిప్రాయం!