అశ్వినీ కుమార్, బన్సాల్ తరువాత కపిల్ సిబాల్ వంతు వచ్చిందా

 

బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.

 

ఆయన న్యాయ శాఖామంత్రి పదవి చెప్పట్టగానే, తన ముందు పనిచేసిన మంత్రి అశ్వినీ కుమార్ వోడా ఫోన్ టాక్స్ వ్యవహారంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఆ కంపెనీతో ఉన్న ఆర్ధిక వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని బహిరంగంగా చెప్పడంతో ఆయన కూడా సరికొత్త వివాదంలో చిక్కుకొన్నారు.

 

బ్రిటన్ దేశానికి చెందిన హచిన్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ భారత్ లో తన టెలికం వ్యాపారాన్ని వోడా ఫోన్ సంస్థవారికి అమ్మేసింది. ఆ రెండు సంస్థల మద్య 2007లో జరిగిన ఈ రూ. 50,000 కోట్ల వ్యాపార లావాదేవీలలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ. 11,217 కోట్ల వరకు పన్ను చెల్లించవలసి ఉంది. కానీ, హచిన్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ అందుకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.

 

ఆ కేసులో కపిల్ సిబాల్ కొడుకు అమిత్ సిబాల్ హచిన్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ తరపున 2007- 2009మద్య వాదించాడు. ఆ కారణంగానే కపిల్ సిబాల్ న్యాయ శాఖామంత్రిగా పదవి చెప్పట్టగానే, వోడా ఫోన్- హచిన్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు అనుకూలంగా, ముందు పనిచేసిన మంత్రి అశ్వినీ కుమార్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారని ఆరోపిస్తున్నారు ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. కపిల్ సిబాల్ ఈవిధమయిన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి రావలసిన రూ. 11,217 కోట్ల వరకు పన్ను నష్టపోతామని తెలిసినప్పటికీ ఆయన తన కొడుకు ప్రాతినిద్యం వహించిన విదేశీ కంపెనీకే ప్రయోజనం చేకూర్చేందుకే మొగ్గు చూపడాన్ని కేజ్రీవాల్ తప్పు పట్టారు. ఒక బాధ్యతగల పదవిలో ఉంటూ దేశప్రయోజనాలు కాపాడవలసిన న్యాయ శాఖా మంత్రే స్వయంగా ఇటువంటి తప్పుకి ఒడిగట్టడం ఆయన తీవ్రంగా ఖండించారు.

 

కానీ, కపిల్ సిబాల్ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తానూ టెలీకాం మంత్రిగా బాధ్యతలు చెప్పటిననాటి నుండి తన ఇద్దరు కొడుకులూ టెలీకాం శాఖకు చెందిన ఈ కేసుని కూడా చెప్పట్టలేదని ఆయన చెప్పుతున్నారు.

 

అయినప్పటికీ, ఇన్ని వేలకోట్ల రూపాయల వ్యవహారంపై ఆయన అంత హడావుడిగా ఎందుకు నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు.

 

కపిల్ సిబాల్ కేంద్ర టెలీ కమ్యునికేషన్స్ తో బాటు, ఇప్పుడు న్యాయశాఖ బాధ్యతలు కూడా చెప్పడంతో, 2007 నుండి కోర్టులో నలుగుతున్న ఆ రెండు శాఖలకు సంబంధించిన ఈ వేలకోట్ల వ్యవహారాన్ని ఆయన బాధ్యతలు చెప్పటిన 24గంటలలోనే ఒకేఒక్క సంతకంతో మార్చిపడేసారు. తన ముందు పనిచేసిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ ఏ పరిస్థితుల్లో పదవి కోల్పోయాడో తెలిసి కూడా కపిల్ సిబాల్ ఇంత దైర్యంగా కోర్టులో ఉన్న కేసును కోర్టు బయట పరిష్కరించుకొందామని నిర్ణయించడం సాహసమే అవుతుంది.

 

అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ అంశాన్ని బీజేపీ త్వరలో అందిపుచ్చుకొని కపిల్ సిబాల్ ను కూడా పదవిలో తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే, రేపు ఆయన పదవికి కూడా ఎసరు వస్తే, యుపీయే ప్రభుత్వానికి ఇది మరో చెంప దెబ్బ అవుతుంది.