శారదలేఖలతో చైతన్యం కల్పించిన కనుపర్తి వరలక్ష్మమ్మ

కనుపర్తి వరలక్ష్మమ్మ
(6 అక్టోబర్ 1896 - 13 ఆగస్టు 1978)

 

విద్యలో పాటు విషయ పరిజ్ఞానం ఉన్న మహిళలు తమ సమస్యలనే కాకుండా సమాజంలో తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించగలుగుతారు. సమస్యలను చర్చిస్తూ పరిష్కారాలను సూచిస్తూ అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయత్నమే చేశారు ప్రముఖ రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ. శారదలేఖలు పేరుతో ప్రచురితమైన శీర్షిక ద్వారా మహిళల సమస్యలను చర్చిస్తూ వారిలో చైతన్యం కలిగించారు. సామాజిక మార్పు దృక్పథంతో సాగే ఆమె రచనలు ఎందరినో ప్రభావితం చేశాయి. తన రచనలకు గాను 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ. మద్రాస్, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ,  ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి కూడా వరలక్ష్మమ్మ నే కావడం అభినందనీయం.

 

బాపట్లలో 1896లో అక్టోబర్ 6న వరలక్ష్మి జన్మించారు. తల్లిదండ్రులు హనుమాయమ్మ పాలపర్తి శేషయ్య. ఆమెకు ఏడుగురు తోబుట్టువులున్నారు. చిన్నతనంలోనే సాహిత్యంపై ఆసక్తితో ఆమె ఎన్నోపుస్తకాలు చదివేవారు. 13ఏండ్ల వయసులో విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసే కనుపర్తి హనుమంతరావుతో 1909లో పెళ్లి జరిగింది. భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ఎన్నో రచనలు, అనువాదాలు చేశారు. పదవులు అలంకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ రచయితగా సత్కారం అందుకున్నారు.

 

వరలక్ష్మమ్మ మొదటి కథ సౌదామిని 1919లో ఆంగ్లానువాదం చేశారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మి లో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న పేరుతో ఒక శీర్షిక రాశారు. ఆ కాలంలో మహిళలు ఎదుర్కోంటున్న అనేక సమస్యలు చర్చిస్తూ వాటికి పరిష్కారాలు సూచిస్తూ సాగే ఆ శీర్షికలు పాఠకాదరణ ఎంతో ఉండేది. ఆ తర్వాత  శారదలేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించేరు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి దోహదం చేశాయి. ఒక రచయిత్రి ఒక పత్రికలో అంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం అదే మొదటిసారి అని అంటారు. తన రచనలతో సమస్యలపై అవగాహన కల్పించిన రచయితగా ఆమె మహిళా పాఠకుల్లో అభిమానం సంపాదించుకున్నారు. సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో ఆమె రచనలు చేశారు. లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం, పునః ప్రతిష్ఠ వంటి నాటికలు, ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం, ‘సత్యా ద్రౌపది సంవాదం’, 'నాదు మాట' మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల కోసం అనేక పాటలు, నవలలు, పిట్ట కథలు రచించారు. ప్రముఖుల జీవిత చరిత్రలు, కథలు రచించారు. అంతేకాదు ఆమె రచనలు కొన్ని తమిళ, కన్నడ, హిందీ భాషలలో కి అనువదించారు.

 

రచయితగానే కాదు స్వాంతంత్య్ర సమరంలోనూ ఆమె పాల్గొన్నారు. 1921లో విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీ ని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు . “నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి . మహిళల్లో పోరాటపటిమను తన రచనల ద్వారా పెంచారు.

 

సామాజిక సేవారంగంలోనూ విశేషకృషి చేశారు వరలక్ష్మమ్మ. బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు.

 

గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా కొనసాగారు. గుడివాడ ప్రజలు ఆమెను ప్రేమగా కవితా ప్రవీణ అని పిలుచుకునేవారు.
సాహిత్యరంగంలో రాణించి, స్వాతంత్య్రఉద్యమంలో పాల్గొన్ని మహిళాభ్యుదయం కోసం పనిచేసిన ఆమె 13 ఆగస్టు 1978న మరణించారు.