చైర్మన్ కీ, ఈవోకీ మధ్య కంకణం జగడం!

KANUMURI BAPIRAJU, LV SUBRAHMANYAM, TIRUMALA BRAMHOTSAVALU, KANKANA DHARANAM, DISPUTES BETWEEN EO AND CHAIRMAN, TIRUMALA HILLS

టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకీ ఈఓ ఎల్.వి.సుబ్రహ్మణ్యానికీ మధ్య పొరపొచ్చాలొచ్చాయని ఆలయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయ్. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేవేళ బంగారు వాకిలిదగ్గర ఈఓ కంకణధారణ చేయడం చాలాకాలంగా ఆనవాయితీ. కంకణ ధారణ చేసిననాటినుంచీ ఉత్సవాలు పూర్తయ్యేవరకూ ఊరి పొలిమేర దాటకూడదని నిమయంకూడా. ఈ నియమానికి కట్టుబడి ఉండలేమేమో అన్న అనుమానంతో గతంలో కొందరు ఈఓలు ఈ బాధ్యతను చైర్మన్ కి అప్పగించిన సందర్భాలుకూడా ఉన్నాయ్. కానీ.. ఈ సారి మాత్రం ఈఓ అలాంటి అప్పగింతలేవీ పెట్టకుండానే చైర్మన్ కనుమూరి బాపిరాజు బంగారు వాకిలి దగ్గరికొచ్చి కంకంణం కట్టించుకున్నారు. ఈఓ సుబ్రహ్మణ్యం మాత్రం అక్కడికి రాకపోవడం విశేషం. తనకు దక్కాల్సిన గౌరవాన్ని బాపిరాజు తన్నుకుపోతున్నరన్న ఉక్రోషంతో సుబ్రహ్మణ్యం కలిసిరాలేదన్నది కొందరు ఉద్యోగులు చెబుతున్న మాట. డాలర్ శేషాద్రితోపాటు ఇతర అధికారుల కోరిక మేరకే తాను కంకణ ధారణం చేశానని కనుమూరి బాపిరాజు చెబుతున్నారు. తిరుమలలో చైర్మన్.. ఫలఫుష్ప ప్రదర్శన శాలను, మీడియా సెంటర్ ని ప్రారంభించినప్పుడు ఈఓ సుబ్రహ్మణ్యం దరిదాపుల్లోకూడా కనిపించకపోవడం, ఇరువురికీ మధ్య విభేధాలు పెరుగుతున్నాయనడానికి సూచనని స్థానికులు అనుకుంటున్నారు.