ఏపీలో కాంగ్రెస్ ని ఎందుకు వదిలేశారు బాబు?

 

కొద్ది నెలలుగా బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు బీజేపీ నేతలు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, హోదా విషయంలో చంద్రబాబే యూ టర్న్ తీసుకున్నారని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీ మరో కొత్త పాయింట్ తో టీడీపీ మీద విమర్శలు మొదలు పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎందుకు దూరం పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని ఎందుకు వదిలేశారని చంద్రబాబుని ప్రశ్నించారు. టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని, చంద్రబాబులా తాము రోజుకో వేషం వెయ్యలేమని అన్నారు. చంద్రబాబు ప్యాకేజీని సమర్ధించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని కన్నా అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న రాజమండ్రిలో ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం అవుతారని కన్నా చెప్పారు. మార్చి ఒకటిన విశాఖలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ సమావేశమవుతారని తెలిపారు. ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని అధికారంలోకి రావడమే లక్ష్యమని కన్నా అన్నారు.