2జీ స్కాం..మరి దోషులు ఎవరు ? 1.7 లక్షల కోట్లు ఏమయ్యాయి..?

 

2జీ స్కాం... దేశంలో ఈ కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం చోటుచేసుకుంది.  ఆ సమయంలో  టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఎ.రాజా..  2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ అవినీతికి పాల్పడ్డారని.. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కాగ్‌ ఆరోపణలు చేయడంతో 2010లో ఎ. రాజాను అప్పటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్‌ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఇన్ని సంవత్సరాల తరువాత... పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  ఈ కేసులో దోషులుగా ఉన్న కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళి, మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజాను కోర్టు నిర్దోషులుగా తేల్చుతూ  పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.  వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

 

ఇక్కడి వరకూ బాగానే ఉంది.. అయితే ఇంత హంగామా చేసి ఇప్పుడు అసలు స్కాం అనేదే జరగనట్టు కోర్టు వారందరినీ నిర్దోషులని తేల్చిచెప్పేసింది. మరి ఇంతకీ స్కాం జరిగిందా లేదా..? అన్నది ఇప్పుడు అందరిలో మొదలవుతున్న ప్రశ్న. ఒకపక్క నాడు వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్ 1.7 లక్షల కోట్ల భారీ స్కాం అని ఆరోపించింది. కాని కోర్టు మాత్రం సరైన ఆధారాలు లేవు అని, స్కాంలో ఎవరూ నిందుతులు కాదు అని సింగల్ లైన్ చాలా సింపుల్ గా తీర్పు ఇచ్చింది. కోర్టు అయితే తీర్పునిచ్చింది కానీ... ఎవరి డౌట్లు వారికి ఉన్నాయి. అవేంటంటే.. ఆ 1.7 లక్షల కోట్లు ఎవరు తిన్నారు ? వారు దోషులు కాకపొతే, మరి దోషులు ఎవరు ? ఇంతకీ స్కాం జరిగిందా ? తీర్పుని బట్టి చుస్తే, అసలు 2జీ స్కాం జరగనేలేదు అనే భావన వ్యక్తం అవుతుంది ? మరి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు ? 1.7 లక్షల కోట్ల భారీ స్కాంలో, ఒక్కరు కూడా దొంగ కాదా ? ఒక్క ఆధారం కూడా సిబిఐ చూపించలేదా ? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు. మరి వీటికి సమాధానం ఎవరు చెపుతారంటే... అదికూడా సమాధానం లేని ప్రశ్నే అవుతుంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఇంత జరుగుతున్నా అసలు బీజేపీ ఏం చేస్తుంది. ఈ స్కాం జరిగింది యూపీఏ హయాంలో.. అప్పుడంటే బీజేపీ అధికారంలో లేదు.. ప్రతిపక్షంలో ఉంది... అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. కోట్లకి కోట్లు లూటీ చేసింది అని ప్రచారాస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు తనే అధికారంలో ఉన్నా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంది. తన చేతిలో సిబిఐని ఉంచుకుని కూడా సరైన ఆధారాలు ఎందుకు చూపించలేదు ? ఎందుకు ప్రూవ్ చెయ్యలేక పోయింది ? కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయిందా..? ఏదో ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు... ఏకంగా లక్షల కోట్లు.. అంత పెద్ద స్కాం ఎవరూ ఏం చేయకుండానే. మాయమైపోయిందా...?. అంతేకాదు ఇక్కడ కూడా అనుమానాలు రాక మానదు. ఎందుకంటే.. గత నెలలో మోడీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటికి పరామర్శకు వెళ్లారు. ఆయనతో స్వయంగా మాట్లాడారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు తీర్పు వెలువడే ఒక్క రోజు ముందు మోడీ, కరుణానిధిని కలవడంతో అప్పట్లో తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు చూస్తే ఇందులో ఏదో రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద స్కాం విషయంలో కూడా రాజకీయ ప్రయోజనాన్నే చూస్తున్నారా..? నేతలు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కేసును నీరుగార్చారా..?

 

ఇక అసలు ఈ 2జీ స్కాంను బయటపెట్టిన బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి గారు ఏం చేస్తున్నారు. ఆయన్నింటిలో వేలు పెట్టే ఆయన తాను బయటపెట్టిన స్కాం గురించి ఏమంటున్నారు..?ఆయన రియాక్షన్ ఏంటి? పాపం ఆయన మాత్రం అనేదేముంటుంది.. తీర్పును తప్పుబట్టడం తప్ప. అదే చేశారు. తీర్పుపై స్పందించిన ఆయన.. వెంటనే ప్రభుత్వం హైకోర్టులో తీర్పుపై అప్పీలు చేయాలని సూచించారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసునూ హైకోర్టు కొట్టివేస్తే కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు పండగ చేసుకున్నాయని, కానీ, సుప్రీం కోర్టు మాత్రం హైకోర్టు తీర్పును ఖండించిందని, 2జీ స్కాంలోనూ అదే పునరావృతం అవుతుందని సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. ఏది ఏమైనా.. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయిన 2జీ స్కాం తీర్పు సగటు భారతీయుడికి షాకిచ్చింది. ఎవరూ దొంగలుకాకపోతే... అన్ని కోట్లు ఎవరు తిన్నట్టో..? ఈ స్కాం విషయంలో కాగ్ పొరపాటు పడిందా..? లేక సీబీఐ చతికిల పడిందా..?