‘కారు’కు ‘కమ్మ’ని కబురు!

గ్రేటర్‌లో కమ్మ ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే?

 

‘అమరావతి’పై ‘కమలం’ కప్పగంతులే కారణమట

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం, మరోసారి టీఆర్‌ఎస్ ‘కారు’ వైపే  చూస్తోందా? నగరంలోని కమ్మ వర్గ పెద్దలు, వివిధ పార్టీల్లో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలు చెబుతున్న విశ్లేషణ ప్రకారం.. పలు నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గం, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కూడా కమ్మ వర్గానికి నాలుగు సీట్లు ఇచ్చినా.. ఆ కులం ఓటర్లు మాత్రం కారు ఎక్కేందుకే ఆసక్తి ప్రదర్శిస్తుండటం విశేషం.

 

కమ్మ వర్గం స్వాభావికంగా టీడీపీకి, సంప్రదాయ ఓటు బ్యాంకుగా దశాబ్దాల నుంచి కొనసాగుతోందన్నది బహిరంగమే. దాని పలితంగానే ఉమ్మడి రాష్ట్రంలో, నగరంలోని శేరిలింగంపల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగలిగింది. అక్కడ సెటిలర్ల సంఖ్య ఎక్కువయినప్పటికీ, వారిలో కమ్మ వారి హవానే ఎక్కువ కావడం దానికి మరో ప్రధాన కారణం.

 

రాష్ట్ర  విభజన తర్వాత కూడా... నగరంలో టీడీపీ చెప్పుకోదగ్గ ఫలితాలే సాధించింది. అయితే, చంద్రబాబునాయుడు తెలంగాణపై దృష్టిసారించకపోవడంతో,  ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. పోనీ ఆ తర్వాత కూడా బాబు మేల్కొనకపోవడంతో, ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడారు. ఇప్పుడు మొత్తం 150 డివిజన్లలో 90 డివిజన్లకే పోటీ చేస్తుందంటే, ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ, ఎన్టీఆర్ హయాం నుంచి పనిచేస్తున్న నేతలు మాత్రమే టీడీపీలో కొనసాగుతుండగా, వారిలో కమ్మవారే ఎక్కువ. ఇతర పార్టీల్లో అవకాశం లేక, ఉన్నా అక్కడి వాతావరణంలో సర్దుకోలేక, విధిలేక టీడీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి. నిజానికి ఈ ఎన్నికల్లో అంతమంది అభ్యర్ధులను వెతికి నామినేషన్లు వేయించడం.. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా నాయకత్వ ప్రతిభ, పొలిట్‌బ్యూరో సభ్యుడయిన అరవిందకుమార్‌గౌడ్ పర్యవేక్షణ ఫలితమని చెప్పకతప్పదు.

 

అయితే, టీడీపీకి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న కమ్మవారికి.. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లు మాత్రమే ఇచ్చారంటే, టీడీపీని కమ్మ వారు ఎంత వేగంగా వీడిపోతున్నారో స్పష్టమవుతోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో విజయాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నప్పటికీ, కమ్మ వర్గ నేతలు.. టీడీపీ వైపు కాకుండా టీఆర్‌ఎస్-బీజేపీ వైపు చూడటం ఆశ్చర్యం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగెస్ 2, టీడీపీ 6 సీట్లు కమ్మ వర్గానికి ఇవ్వడం విశేషం. అంటే కమ్మ వర్గం మాసికంగా టీడీపీని అభిమానిస్తున్నప్పటికీ, రాజకీయంగా ఇతర పార్టీల వైపు చూస్తుందని స్పష్టమవుతోంది. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానికంగా తమ నియోజకవర్గాల్లో కమ్మ వారితో తొలి నుంచీ కలసి ఉండటం ప్రస్తావనార్హం.

 

సహజంగా కమ్మవర్గం మిగిలిన కులాలకంటే ఒక తరం ముందు ఆలోచిస్తుంది. ఎవరితోనూ గొడవ పడకుండా, తమ వ్యాపారాలేవో తాము చేసుకునే తత్వం దాని సొంతం. ఏ ప్రభుత్వంలో ఉన్నా కావలసినవి ఇచ్చి, పనులు చేయించుకోవడం వారి ప్రత్యేకత. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చుట్టూ చేరిన కమ్మ వ్యాపారులు, వైఎస్ సీఎం అయిన వెంటనే ఆయన చుట్టూ చేరిపోయారు. ఆ తర్వాత వచ్చిన సీఎంల చుట్టూ కూడా వారే కనిపించేవారు. జగన్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారిలో కూడా కమ్మ వ్యాపారులే ఎక్కువ. అంటే వ్యాపారం వారి రక్తంలో ఒక భాగమన్నది తెలిసిందే.

 

ఎక్కడ.. ఏది లాభం అనుకుంటే,  అటే అడుగులేసే తెలివైన కులంగా పేరుంది. లాభనష్టాల బేరీజు.. ఇతరులను వాడుకోవడంలో,  కమ్మ వర్గ నైపుణ్యం ముందు ఎవరూ సరిరారన్నది బహిరంగ రహస్యం. ప్రతిదీ వ్యాపారకోణంలో ఆలోచించే కమ్మ వర్గానికి, ఇతర సామాజికవర్గం నుంచి సహకారం-మద్దతు లభించడం కష్టం. ఇతరులతో కలిసి నడిచే అలవాటు తొలి నుంచీ ఆ వర్గానికి లేదు. ఈ వ్యాపారతత్వం కృష్ణా జిల్లాలో.. బ్రాహ్మణ-వైశ్యులతో సహా, కుల-మతాలకు అతీతంగా అలవాటుకావటం మరో విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన ప్రతి కులం-మతంలో, వ్యాపారధోరణి స్పష్టంగా కనిపిస్తుంటుంది. అది వేరే విషయం.

 

సహజంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, డబ్బు సంపాదన మెళకువల్లో నిష్ణాతులైన కమ్మ వర్గం.. ఆ ధ్యాసలో పడి, ఇతర సామాజికవర్గాల సహకారం తమకు అవసరం లేదని భావిస్తుంటుంది. కమ్మ సామాజికవర్గం దేనినయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది కానీ,  డబ్బును పోగొట్టుకునేందుకు మాత్రం  సిద్ధంగా ఉండదన్న సామెత వినిపిస్తుంటుంది. అందుకే.. రెడ్డి, వెలమ వర్గాలతో పోలిస్తే, కమ్మ వర్గానికి ఉండే ఇతర వర్గాల దన్ను బహు తక్కువ. ఇన్ని లక్షణాలున్న కమ్మవర్గం.. ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా, కష్టపడి వ్యాపారాల్లోనే సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తుందన్నది కూడా అంతే నిజం.

 

ఇప్పుడు హైదరాబాద్‌లో దశాబ్దాల నుంచి స్థిరపడిన కమ్మ వర్గం, ఇదే ధోరణిలో టీఆర్‌ఎస్‌కు మద్దతుదారుగా మారటం గమనార్హం. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ ఈ వర్గం టీఆర్‌ఎస్‌కే జై కొట్టింది. చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్లినందున, తమ రక్షణ కోసమే వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగించింది. చంద్రబాబు హైదరాబాద్‌లో పార్టీని వదిలేయడంతో, కమ్మ వర్గం తమకు టీఆర్‌ఎస్ ఒక్కటే  సురక్షితమైన పార్టీగా ఎంచుకున్నారు. దాని ఫలితమే సెటిలర్లు ఉండే నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపు. ఇప్పుడు ఆ వర్గం నేతలు బీజేపీలో చేరినా, కమ్మ ఓటర్లు మాత్రం కారు ఎక్కేందుకే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

 

ఇక ఇతర పార్టీల్లో స్థానిక అంశాల కారణంగా చోటు లభించక కొందరు.. ఆయా పార్టీల్లో ఇమడలేని మరికొందరు కమ్మ వర్గ నేతలు మాత్రమే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కమ్మ వర్గ ప్రాధాన్యతను గుర్తించిన టీఆర్‌ఎస్, ఆ వర్గ నేతలకు సీట్లిచ్చింది. కూకట్‌పల్లి అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కొమ్మినేని వికాస్ ఇంటికి స్వయంగా కేటీఆర్ వెళ్లి, కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి, వికాస్ సహకారం కోరారు. ఆ తర్వాత శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌తోపాటు, ఖమ్మం జిల్లాలో కూడా కమ్మ వర్గ నేతలకే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీట్లిచ్చింది. పువ్వాడకు క్యాబినెట్‌లో చోటు కూడా ఇచ్చింది.  తాజా గ్రేటర్ ఎన్నికల్లో కూడా కమ్మ వర్గం చూపు, టీఆర్‌ఎస్ వైపే కనిపిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో.. కమ్మ వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయి, నగరంలోని కమ్మ ప్రముఖులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారట.

 

ఇదిలాఉండగా... నగరంలో కమ్మ వర్గంతోపాటు, సెటిలర్ల అభిప్రాయాలపై తాము వివిధ నియోజకవర్గాల్లోని, ఆయా వర్గాల వారితో ముచ్చటించడం జరిగింది.  ఆ ప్రకారంగా... నిజానికి సెటిలర్లలో ఎక్కువ శాతం ఈసారి బీజేపీకి ఓటు వేయాలన్న ధోరణిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఏపీలో,  అమరావతి అంశానికి బీజేపీ మద్దతు ఇవ్వని కారణంగా.. ఆ పార్టీకి బదులు, గతంలో మాదిరిగానే ఈసారి కూడా టీఆర్‌ఎస్ మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నట్లు, వారి మాటల్లో స్పష్పమయింది. ఈ విషయంలో వారి వాదన-వైఖరి విచిత్రంగా అనిపించింది. అమరావతికి అడ్డంకులు సృష్టిస్తున్న ఏపీ సీఎం జగన్... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతగానే ఉన్నారు. అయితే, జగన్‌తో దోస్తానా చేస్తున్న కేసీఆర్‌పై కరుణ.. కేసీఆర్ మద్దతునిస్తున్న జగన్‌పై కోపం ప్రదర్శించడమే విచిత్రం.

-మార్తి సుబ్రహ్మణ్యం